బంగ్లాల నిర్మాణం కోసం రుణం తీసుకుని, ఆపై వాటిని అమ్మిన తర్వాత కూడా ఆ రుణం చెల్లించకపోవడంతో ఇద్దరు డెవలపర్లపై కేసు నమోదైంది. ద్వారకేష్ డెవలపర్స్ భాగస్వాములు అతుల్ పటేల్, పీయుష్ పటేల్ పై ఓ లోన్ కంపెనీకి చెందిన బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ విశాల్ మిర్ ఫిర్యాదు చేయడంతో అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
‘2017లో పీయుష్ పటేల్ మా వద్దకు వచ్చి 12 బంగ్లాల నిర్మాణం కోసం రూ.1.5 కోట్లు రుణం ఇవ్వాలని కోరారు. మేం సంబంధిత పత్రాలన్నీ పరిశీలించిన తర్వాత ఆ మేరకు నాలుగేళ్ల కాలానికి 21 శాతం వార్షిక వడ్డీతో రుణం మంజూరు చేశాం. సబ్ రిజిస్ట్రార్ ముందు మార్ట్ గేజ్ ఒప్పందం కూడా జరిగింది. అనంతరం 2018 ఫిబ్రవరిలో రూ.25 లక్షలు చెక్ ద్వారా చెల్లించారు. అలాగే 2017 నవంబర్ నుంచి 2018 మార్చి మధ్య కాలంలో ఐదు వాయిదాల్లో రూ.23.27 లక్షలు చెల్లించారు. ఆపై ఎలాంటి చెల్లింపులూ చేయలేదు. పైగా మార్ట్ గేజ్ ఉన్నప్పటికీ ఆ బంగ్లాలను ఇతరులకు అమ్మేశారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.