నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణం తీసుకుని మోసం చేసిన వ్యవహారంలో విశాఖపట్టణానికి చెందిన డెవలపర్ పై బెంగళూరులో కేసు నమోదైంది. విశాఖకు చెందిన విజయ్ కుమార్ మన్యం, ఆయన భార్య మోగిలి కనక సుభాషిణి, వారి బంధువు అనాల స్వాతిపై బెంగళూరులోని కుబ్బాన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరు ముగ్గురూ విశాఖ కేంద్రంగా ఉన్న మన్యం ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవ్య ఇన్ ఫ్రాకన్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
మన్యం స్కై పార్క్ పేరుతో బెంగళూరులోని జక్కూరులో తలపెట్టిన ప్రాజెక్టు కోసం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.16 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే, తర్వాత ఆ సొమ్మును ప్రాజెక్టు కోసం వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నట్టు తేలింది. దీంతో ఆ కంపెనీ ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు వారిపై వైజాగ్ లోనూ కేసులు ఉన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడాను మోసం చేసినందుకు వైజాగ్ ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ లో వారిపై రెండు కేసులు నమోదైనట్టు వివరించారు.