వందల కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించినందుకు మహేశ్వరం తహసీల్దారు ఆర్పీ జ్యోతి, ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై మహేశ్వరం పోలీసు స్టేషన్లో కేసు నమోదు (నెంబర్ 83/2023) అయ్యింది. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని 181 సర్వే నెంబర్లో ఈ 42 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటం గమనార్హం. XVII అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు.. ఐపీసీ సెక్షన్ 156 (2), సీఆర్పీసీ సెక్షన్లు 420, 166 కింద మహేశ్వరం తహసీల్దారు మరియు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆర్పీ జ్యోతి, ఈఐపీఎల్ కన్స్ట్సక్షన్స్ కొండపల్లి శ్రీధర్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. మెహదీపట్నం నివాసి దస్తగిర్, ముజఫర్ హుస్సేన్ ఖాన్ మహేశ్వరంలోని 42 ఎకరాల స్థలానికి యజమానులని.. ఈ భూమిని 2005 అక్టోబరు 4న కొనుగోలు చేశామని.. అదే ఏడాది మరుసటి నెలలో మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ కూడా చేశామని కోర్టుకు విన్నవించారు. లేట్ మహ్మద్ అక్బర్ అలీ ఖాన్, మహ్మద్ ఫారూఖ్ అలీ ఖాన్ లకు వారి తండ్రి అయిన లేట్ నవాబ్ హాజీ ఖాన్ నుంచి నోటి మాట (ఓరల్ గిఫ్ట్- హిబా) ద్వారా సంక్రమించిన భూమిని తాము కొనుగోలు చేశామని కోర్టుకు తెలిపారు. అయితే, 2021 అక్టోబరు 10న శ్రీమతి ఖాదరున్నీసా, మహ్మద్ మునావర్ ఖాన్, మహేశ్వరం తమహశీల్దారు శ్రీమతి ఆర్పీ జ్యోతి, బొబ్బిలి దామోదర్ రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎన్ సంతోష్ కుమార్, కొండపల్లి శ్రీధర్ రెడ్డిలు అక్రమ రీతిలో కొనుగోలు చేసి.. పాస్ పుస్తకాలు పొందారని, రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేయించుకున్నారని తెలిపారు. మొత్తం విస్తీర్ణం 103. 35 ఎకరాలకు గాను వీరు దాదాపు 42.33 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేసి.. పాస్ పుస్తకాలను పొందారని కోర్టుకు వివరించారు. పైగా, ఈ భూమి మొత్తం నిషేధిత భూమి జాబితా (22-ఏ) లో ఉందని కోర్టుకు విన్నవించారు. మొత్తానికి, ఈ కేసులో ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డితో పాటు తహశీల్దారు ఆర్పీ జ్యోతితో సహా మిగతా ఐదుగురు అక్రమరీతిలో మోసపూరితంగా భూమిని తమ పేరిట నమోదు చేసుకున్నారని తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండీ.. తహశీల్దారు అక్రమార్కులకు వంత పాడటం సబబు కాదని దస్తగిరి, ముజఫర్ హుస్సేన్‌లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, ఈ ఏడుగురురిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో మహేశ్వరం పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు.