Categories: LEGAL

ఆమ్రపాలి డెవలపర్స్ పై సీబీఐ కేసు

బ్యాంకును రూ.472 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఆమ్రపాలి స్మార్ట్ సిటీ డెవలపర్స్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీ కారణంగా కార్పొరేషన్ బ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంకు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలతో కూడిన కన్సార్టియానికి రూ.472.24 కోట్ల నష్టం వాటిల్లిందంటూ వచ్చిన ఫిర్యాదుపై సీబీఐ రంగంలోకి దిగి ఈ మేరకు కేసు నమోదు చేసింది.

ఆమ్రపాలి సంస్థ రుణం తీసుకున్న అనంతరం తొలి నుంచి కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేయలేదంటూ కార్పొరేషన్ బ్యాంకు ఫిర్యాదు చేసింది. ‘రుణం మొత్తం విడుదల చేసిన తర్వాత ఆమ్రపాలి స్మార్ట్ సిటీ డెవలపర్స్ సంస్థ ఉద్దేశపూర్వకంగానే చెల్లింపులు ఎగవేసింది. నెమ్మదిగా ఆ ఖాతా నిరర్థక ఆస్తిగా మారిపోయింది’ అని అందులో పేర్కొంది. అంతేకాకుండా ఇప్పటికే ఆ కంపెనీపై సుప్రీంకోర్టు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించిందని.. ఆ నివేదిక నేరుగా కోర్టులో సమర్పించాలని తెలిపింది.

ఆమ్రపాలి గ్రూప్ ఆ రుణ మొత్తాన్ని డమ్మీ కంపెనీలు తరలించడంతోపాటు బోగస్ బిల్లులు, తక్కువ ధకు ఫ్లాట్లు అమ్మడం, అధిక మొత్తం బ్రోకరేజీ చెల్లించినట్టుగా చూపించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని తెలిపింది. ఇలా ఫెమా, ఎఫ్ డీఐ నిబంధనలకు విరుద్ధంగా మనీ ల్యాండరింగ్ కు పాల్పడిందని, తద్వారా బ్యాంకుల కన్సార్టియానికి రూ.472.24 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించింది. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ.. ఆమ్రపాలి సంస్థతోపాటు దాని ముగ్గురు డైరెక్టర్లు అనిల్ కుమార్ శర్మ, శివప్రియ, అజయ్ కుమార్, ఆడిర్ అమిత్ మిట్టల్ పై కేసు నమోదు చేసింది.

This website uses cookies.