ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి బెంగళూరులోని కింగ్ ఫిషర్ టవర్స్ లో ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.50 కోట్ల వెచ్చించి కొన్న ఈ లగ్జరీ ఫ్లాట్ 16వ అంతస్తులో 8,400 చదరపు అడుగుల పరిమాణంలో ఉంది. ఇందులో నాలుగు బెడ్ రూములు ఉన్నాయి. అలాగే ఈ ఫ్లాట్ ఐదు కార్ పార్కింగ్ స్థలాలు కలిగి ఉంది. 8,400 చదరపు అడుగుల ఫ్లాట్ కు రూ.50 కోట్లు వెచ్చించిన నేపథ్యంలో చదరపు అడుగు ధర రూ.59,500గా పలికినట్టయింది. బెంగళూరులో ఇది అత్యధిక ధర అని చెబుతున్నారు.
కింగ్‌ఫిషర్ టవర్స్ నాలుగున్నర ఎకరాల స్థలంలో ఉన్న 34 అంతస్తుల లగ్జరీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్. ఇందులో 8వేల చదరపు అడుగుల పైబడిన పరిమాణంలో 81 4 బీహెచ్ కే యూనిట్లు ఉన్నాయి. ఒకప్పుడు విజయ్ మాల్యా పూర్వీకుల నివాసంగా ఉన్న ఈ భూమిని 2010లో ప్రెస్టీజ్ గ్రూప్, మాల్యా కంపెనీ జాయింట్ వెంచర్‌లో అభివృద్ధి చేశారు. ఈ లగ్జరీ అపార్ట్ మెంట్‌లు మొదట చదరపు అడుగుకు రూ.22వేలకి అమ్ముడయ్యాయి. నారాయణ మూర్తి ఈ ఫ్లాట్ ను ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి కొనుగోలు చేసినట్టు సమాచారం. సాధ్వని రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ ఈ ఒప్పందాన్ని పూర్తి చేసింది. కాగా, ఈ టవర్స్ లో మూర్తికి ఇది రెండో ఫ్లాట్. నాలుగేళ్ల క్రితం మూర్తి భార్య సుధామూర్తి 23వ అంతస్తులో రూ.29 కోట్లకు ఫ్లాట్ కొనుగోలు చేశారు.
This website uses cookies.