Categories: TOP STORIES

శివార్ల‌లో యూడీఎస్ కేటుగాళ్లు

హెచ్ఎండీఏ అనుమతి లేదు.. రెరా నెంబరు తీసుకోలేదు.. తక్కువ రేటుకే ఫామ్ ల్యాండ్స్.. ఓపెన్ ప్లాట్స్ అంటూ ఇప్పటికే కొందరు అక్రమార్కులు ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఈ కోవలోకి సరికొత్త మోసగాళ్లు చేరారు. తక్కువ ధరకే ఫ్లాటు అంటూ సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకునే పనిలో పడ్డారు. రూ. 18 లక్షలకే ఫ్లాట్ అంటూ.. రూ.25 లక్షలకే డబుల్ బెడ్రూం అంటూ ప్రజల్ని బుట్టలో పడేస్తున్నారు. రేటు తక్కువని మధ్యతరగతి ప్రజానీకం వెనకా ముందు చూడకుండా మాయగాళ్ల చేతిలో సొమ్ము పెడుతున్నారు. ఇలాంటి మోసపూరిత రియల్టర్లు నగరం శివార్లలో పెరిగిపోయారు. మరి, వీరి నుంచి అమాయకుల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది?

తెలంగాణ రెరా అథారిటీ అధికారులు, సిబ్బంది ఆఫీసులో కూర్చోవడం బదులు.. శివారు ప్రాంతాల్లో క్రమం తప్పకుండా క్షేత్ర పర్యటన చేయాలి. అప్పుడే ఏయే బిల్డర్లు ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో అర్థమవుతుంది. ఏయే రాయితీలను ప్రకటిస్తారో తెలుస్తుంది. అసలు అపార్టుమెంట్ నిర్మాణాల్ని ఎప్పుడూ చేపట్టని అనేకమంది మాయగాళ్లు.. తక్కువ రేటుకే ఫ్లాట్లను కట్టిస్తామంటూ.. కల్లిబొల్లి కబుర్లు చెబుతూ.. అమాయకుల వద్ద లక్షల సొమ్ము వసూలు చేస్తున్నారు. పైగా, ఎకరాల విస్తీర్ణంలో బ్లాకుల వారీగా నిర్మిస్తామని మాయ చేస్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకుల్ని పట్టుకోవడం కంటే.. ఇలాంటి అక్రమార్కుల్ని ముందే గుర్తించి వారి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలి.

ఎలా గుర్తించాలి?

తెలంగాణ రెరా అథారిటీ సిబ్బందిలో కొంత‌మంది క్ర‌మం త‌ప్ప‌కుండా ఫేస్ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ లో వ‌చ్చే నిర్మాణ సంస్థ‌ల ప్ర‌క‌టన‌ల్ని గ‌మ‌నించాలి. ఏయే సంస్థలు ఎలాంటి రాయితీల‌ను ప్ర‌క‌టిస్తున్నాయో అర్థ‌మ‌వుతుంది. రెరా అథారిటీ వీలైతే ఒక వాట్సాప్ నెంబ‌రును క్రియేట్ చేసి.. ప్లాటు, ఫ్లాటు కొనుగోలు చేసే ప్ర‌తిఒక్క‌ర్ని త‌మ‌కు ముంద‌స్తుగా స‌మాచారం ఇవ్వాల‌ని కోరాలి. ఈ నెంబ‌రును మొత్తం మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం చేయాలి. ఒక్క‌సారి ప్ర‌జ‌ల‌కు ఈ స‌మాచారం చేరితే.. స్థిరాస్తి కొనేట‌ప్పుడు త‌ప్ప‌కుండా రెరాను సంప్ర‌దించి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంటుంది.

మీరు కొంటున్నారా?

కొంద‌రు బిల్డ‌ర్లు ఎక‌రాల్లో అపార్టుమెంట్ల‌ను క‌డ‌తామంటూ మాయ చేస్తున్నారు. నిజానికి, వీరు తొలుత వెయ్యి గ‌జాలో రెండు వేల గ‌జాలో కొనేసి.. ఫ్లాట్ల‌ను కొనేవారికి ఎక‌రాలు కొన్న‌ట్లుగా చూపెడుతున్నారు. మ‌రి, వీరు ఇలా మోసం చేస్తుంటే ఆయా స్థ‌ల య‌జ‌మానులు త‌మాషా చూస్తు ఉండ‌టం విస్తుగొలుపుతుంది. ఈ రియ‌ల్ట‌ర్లు ఫ్లాట్లు కొన్న‌వారికి యూడీఎస్ స్థ‌లాన్ని రిజిస్ట‌ర్ చేస్తున్నారు. ఇలా రిజిస్ట‌ర్ చేయ‌గానే.. ఆయా సంస్థ‌పై కొన్న‌వారికి న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది. దీంతో, చాలామంది అందులో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు.
హెచ్ఎండీఏ అనుమ‌తి తీసుకోకుండా కొంద‌రు ఇలాంటి అక్ర‌మాలు చేస్తుంటే.. మ‌రికొంద‌రు హెచ్ఎండీఏ అనుమ‌తి తీసుకున్నాక‌.. రెరా అనుమ‌తి లేకుండానే యూడీఎస్‌లో ఫ్లాట్లను అమ్ముతున్నారు. ఇలాంటి వారి ప‌ట్ల కొనుగోలుదారులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి. ‘‘ హెచ్ఎండీఏ, రెరాకు ద‌ర‌ఖాస్తు చేశాం.. అతిత్వ‌ర‌లో అనుమ‌తి వ‌స్తుంద’’ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసేవారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఈ రెండు అనుమ‌తులొచ్చాకే కొనుగోలు చేయాలి. చిన్న అపార్టుమెంట్లు అయితే, అనుమ‌తికి కోట్ల రూపాయ‌లు ఖర్చేం కాదని గుర్తుంచుకోండి. రెరా కంటే ముందు, ఆత‌ర్వాత ఫ్లాటును కొనేందుకు ఒక‌ట్రెండు ల‌క్ష‌లు తేడా ఉంటుంది. ఈ సొమ్మును తగ్గించుకునేందుకు మోసగాళ్ల చేతిలో సొమ్ము పోశారంటే.. అసలుకే మోసం వస్తుందని మర్చిపోవద్దు.

ఏజెంట్లు జాగ్రత్త..

పలువురు రియల్టర్లు, బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. హండ్రెడ్ పర్సంట్ పేమెంట్ తో ఫ్లాట్లను అమ్మించే ఏజెంట్లకు అధిక శాతం కమిషన్ ను అందజేస్తున్నారు. దీంతో, ఈ సొమ్ముకు ఆశపడి చాలామంది ఏజెంట్లు యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వీరంతా కేవలం తమ కమిషన్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప.. రేపొద్దున సదరు బిల్డర్ అపార్టుమెంట్ కట్టిస్తాడా? లేదా? అనే విషయం గురించి ఆలోచించట్లేదు. పొరపాటున ఆయా బిల్డర్ అపార్టుమెంట్ కట్టకపోయినా, సమయానికి డెలివరీ ఇవ్వకపోయినా లేదా నాణ్యతతో కూడిన ఫ్లాటును అందించకున్నా.. కొనుగోలుదారులు ఏజెంటును పట్టుకుంటారు. కాబట్టి, ఏజెంట్లు విచక్షణతో వ్యవహరించాల్సిన సమయమిది.

This website uses cookies.