- సాయి సూర్య డెవలపర్ పై చీటింగ్ కేసు
అసలే సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్.. అంత పెద్ద స్టార్ చెబుతున్నాడంటే నమ్మిన చాలా మంది ప్రజలు.. సాయి సూర్య డెవలపర్స్ లో ప్లాట్లను కొనుగోలు చేశారు. కానీ, ఆ తర్వాత ఎం జరిగిందో తెలుసా?
2021లో షాద్ నగర్ లో వేసిన గ్రీన్ మెడోస్ అనే 14 ఎకరాల వెంచర్లో నక్కా విష్ణువర్థన్, మరికొందరు కలిసి రూ.3,21,34,000 పెట్టుబడి పెట్టారు. నాలా, మోర్టగేజ్ ప్లాట్ల కోసం ఈ సొమ్ము వెచ్చించారు. హెచ్ఎండీఏ నుంచి సంబంధిత అనుమతులు వచ్చిన కొన్ని నెలల్లోనే ప్లాట్లు రిజిస్టర్ చేయాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే, రోజులు గడుస్తున్నా ప్లాట్లు అప్పగించకపోవడం.. కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో విష్ణువర్థన్ తదితరులకు అనుమానం వచ్చింది.
దీంతో వారు ఈ వ్యవహారంపై సమాచారం సేకరించగా.. విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. వీరు కొనుగోలు చేసిన మార్ట్ గేజ్ ప్లాట్లను ఇతరులకు అమ్మేసిన సంగతి బయటపడింది. అనంతరం ప్రాజెక్టు సైట్ వద్దకు వెళ్లి చూడగా.. తమకు చెప్పినదానికి, అక్కడున్న పరిస్థితులకు పొంతన లేదని గ్రహించారు. అంతేకాకుండా అనుమతులు కూడా సరిగా తీసుకోలేదని గుర్తించారు. పైగా ఆ భూమికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన సొమ్మును కూడా సరిగా చెల్లించలేదని తెలుసుకున్నారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి విష్ణువర్థన్‌తోపాటు 30 మంది మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కంపెనీ యజమాని సతీశ్ చంద్ర గుప్తాతోపాటు సాయిసూర్య డెవలపర్స్‌పై కేసు నమోదు చేశారు.