రీజినల్ రింగు రోడ్డు దక్షణ భాగమైన 182 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. చౌటుప్పల్-అమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి విస్తరణ పనులకు మోక్షం కలగనుంది. రీజినల్ రింగు రోడ్డు నార్త్ పార్ట్ చౌటుప్పల్-భువనగిరి-తుఫ్రాన్-సంగారెడ్డి-కంది పరిధిలో యూటిలిటీస్ (కరెంటు స్తంభాలు, భవనాల తదితరాలు) తొలగింపునకు సంబంధించిన వ్యయం విషయంలో స్పష్టత ఏర్పడింది. ఇందుకయ్యే ఖర్చును తామే పూర్తిగా భరిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రేవంత్‌రెడ్డికి తెలిపారు. ఆర్ ఆర్ ఆర్‌కు సంబంధించి భూ సేకరణ, విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసల రహదారిగా, హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ ఐఎఫ్ (కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర మంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు.