మధ్యతరగతి ప్రజల సొంతింటి కల తీరనుంది. ఔను.. మీరు చదివింది నిజమే! మార్కెట్ రేటు కంటే సుమారు 50 శాతం తక్కువ రేటుకే అన్నిరకాలుగా అభివృద్ధి చెందిన ప్లాటును ఎంచక్కా కొనుక్కోవచ్చు. పైగా, న్యాయపరంగా చిక్కులు కానీ వివాదాల్లేని భూమి అది. భవిష్యత్తులో నిర్వహణపరమైన ఇబ్బందులూ ఉండవు. ప్రభుత్వ ఉద్యోగులకు పది శాతం కేటాయిస్తారు. ధరలో ఇరవై శాతం రిబేటు ఇస్తారు. ఇలా నియోజకవర్గానికో టౌన్‌షిప్పు రాష్ట్రంలో ఆరంభమైంది. దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయంలో మంగళవారం ఆరంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మొదటి దశలో అనంతపురంలోని ధర్మవరం, గుంటూరులోని మంగళగిరి, వెఎస్సార్ జిల్లా రాయచోటి, ప్రకాశం కందుకూరు, పశ్చిమ గోదావరిలోని ఏలూరు వంటి ప్రాంతాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 150, 200, 240 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు ఉంటాయని తెలిపారు. నెలకు 15 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారు ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్లాటును కొనేవారి కోసం ఏడాదిలో నాలుగు వాయిదాల్లో కట్టే వెసులుబాటును కల్పిస్తామని తెలిపారు.