Categories: TOP STORIES

రోడ్డు ప‌క్క‌న భూమి ధ‌ర‌ కోటి రూపాయ‌లు!

  • మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ఆరంభోత్స‌వంలో
    సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్ల క్రితం ఉన్న భూముల ధ‌ర‌లేమిటి? ఇప్పుడున్న ధ‌ర‌లేమిట‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రారంభోత్సవంలో ఆయ‌న మాట్లాడుతూ.. భూముల ధ‌ర‌లు, రాష్ట్రాభివృద్ధి గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వివ‌రించారు. సారాంశం ఆయ‌న మాట‌ల్లోనే..

రోడ్డు ప‌క్క‌న స్థ‌లముంటే.. ఎక‌రం కోటీ రూపాయ‌లు ప‌లుకుతోంద‌ని.. రాజీవ్ ర‌హ‌దారి ప‌క్క‌న అయితే రెండు నుంచి నాలుగు కోట్లు ప‌లుకుతోంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. మ‌న రైతులు ఎక్క‌డా న‌ష్టానికి రైతులు భూముల్ని అమ్ముకోవ‌డం లేద‌న్నారు. తెలంగాణలో ఎక‌రానికి 20 లక్షలు, 30 లక్షలకు భూముల్లేవ‌ని స్ప‌ష్టం చేశారు. రైతులెవ్వ‌రూ నష్టానికి, కష్టానికి భూములు అమ్మట్లేద‌ని తెలిపారు. మ‌న భూముల్ని కొన‌డానికి ఎవ‌రైనా వ‌స్తే.. రైతులు యాభై ల‌క్ష‌లు ఎక‌రానికి అమ్ముతున్నార‌ని గుర్తు చేశారు.

తెలంగాణ రైతులు ధ‌నికుల‌య్యే అవ‌కాశం ఉన్న‌ప్పుడు దాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో నిరోధించ‌కూడ‌ద‌న్నారు. ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింద‌ని వెల్ల‌డించారు. ఇక్కడ్నుంచి లక్షా యాభై కోట్ల సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరుగుతున్నాయని చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతిరోజు 580 విమానాలు ల్యాండ్ అవుతున్నాయి. రాష్ట్రానికి అనేక పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని వివ‌రించారు.

ప‌ర్యాట‌కానికి రూ.1500 కోట్లు!

మల్లన్న సాగర్ వద్దకు రెండో ఫోర్ లైన్ రోడ్లను డెవలప్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారుల‌కు సూచించారు. అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వసాగర్, వనదుర్గమాత ప్రాజెక్టు వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని డెవలప్ చేసేందుకు రూ.1500 కోట్లు మంజూరు చేయిస్తున్నామని వెల్లడించారు. ఇక్కడికొచ్చి బాలీవుడ్ పరిశ్రమ వచ్చి సినిమాలు షూటింగులు చేసేటంత స్థాయిలో అభివృద్ధి కావాల‌ని ఆదేశించారు. మల్లన్నసాగర్ దగ్గర 600 ఎకరాల భూమి, మధ్యలో ఐల్యాండ్స్ ఉన్నాయ‌ని.. అక్క‌డే 7500 ఎకరాల అటవీ సంపద ఉంద‌ని.. ఇదంతా హైదరాబాద్ స‌మీపంలో ఉంది కాబ‌ట్టి.. మంచిగ అభివృద్ధి చేయాల‌ని ఆదేశించారు.

This website uses cookies.