ఆగస్టులో క్రెడాయ్ తెలంగాణ నిర్వహించే రాష్ట్ర స్థాయి సదస్సును (STATECON-2024) ప్రారంభించడానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అంగీకరించారని తెలిసింది. సుమారు రెండు వేల మంది డెవలపర్లు పాల్గొనే ఈ కార్యక్రమంలో.. నిర్మాణ రంగంలో నెలకొన్న తాజా పోకడల గురించి చర్చిస్తారు. రియల్ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారు.
ఈ సందర్భంగా క్రెడాయ్ తెలంగాణ సెక్రటరీ జి. అజయ్ కుమార్ రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే స్టేట్‌కాన్ వల్ల నిర్మాణ రంగానికెంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మార్కెట్లో ఆవిష్కృతమైన కొత్త పోకడలు, ఆధునిక పరిజ్ఞానాలు వంటివాటిపై బిల్డర్లకు అవగాహన పెరుగుతుందని అన్నారు. గత స్టేట్‌కాన్ ఘనవిజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. ఈసారి యావత్ తెలంగాణ నిర్మాణ రంగం సీఎం రేవంత్‌రెడ్డి సందేశాన్ని వినేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తోందని తెలిపారు.
ఇటీవల సీఎంను కలిసి స్టేట్‌కాన్ 2024కు ఆహ్వానించిన వారిలో.. క్రెడాయ్ తెలంగాణకు చెందిన ఆఫీస్ బేరర్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణా రెడ్డి (ఛైర్మన్), ప్రేంసాగర్ రెడ్డి (అధ్యక్షుడు), కె. ఇంద్రసేనారెడ్డి (అధ్యక్షుడు- ఎలక్ట్), అజయ్ కుమార్ (కార్యదర్శి), మరియు జగన్మోహన్ (కోశాధికారి) తదితరులు పాల్గొన్నారు.