పటాన్‌చెరులోని చిట్కుల్ చెరువు ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. వారం క్రితం పది టన్నుల చేపలు మృతి చెందడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. చెరువులు, భూగర్భజలాలు కలుషితమయ్యాయని చెప్పడానికిదే నిదర్శనమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలకు పైగా పారిశ్రామిక కాలుష్యం యొక్క హానికరమైన ప్రభావాలతో తాము పోరాడుతున్నామని ఆ ప్రాంత నివాసితులు వాపోతున్నారు. అందుకే, పటాన్‌చెరులో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుక్కునేవారు ఈ కాలుష్యం గురించి తెలుసుకున్నాకే తుది నిర్ణయానికి రావాలి.
పటాన్‌చెరులోని పెద్ద చెరువు, ముత్తంగి చెరువు వంటివి కలుషితమయ్యాయి. వాటిలో పదేళ్ల క్రితం అందులో చేపలు పట్టేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా చిట్కుల్‌లో ఆక్సిజన్ తగ్గిపోవడంతో చేపలు చనిపోయాయని కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది. మరి, ఇంతటి దుస్థితికి కారణమైన కాలుష్యకారక పరిశ్రమలపై జిల్లా కలెక్టర్ ఎందుకు కఠిన చర్యల్ని తీసుకోవట్లేదు? ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
పటాన్‌చెరులోని చెరువులన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. అక్కడి చుట్టుపక్కల పరిశ్రమలు వెదజల్లే కాలుష్య కారకాల వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. నగరం నుంచి పరిశ్రమలను పూర్తిగా తరలిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. పెద్దగా కార్యరూపం దాల్చట్లేదు. ఇలాగే వదిలివేస్తే.. భవిష్యత్తులో మరింత దారుణమైన పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని పర్యావరణవేత్తలు అంటున్నారు. అందుకే, పటాన్‌చెరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుక్కునేవారు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది.
మనందరి బాధ్యత!
రాజేశ్వర్ తివారీ, (రిటైర్డ్ ఐఏఎస్)
చెరువులు, సరస్సులు నియంత్రణలేని పట్టణాభివృద్ధి కారణంగా కలుషితం అవుతుంటాయి. వ్యర్థ జలాల్ని, మురుగునీటిని శుద్ధి చేసే ప్రక్రియ సక్రమంగా జరగకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడుతుంది.
కొందరేం చేస్తారంటే.. ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను నదులు, నాలాల్లో డంపింగ్ చేస్తారు.
రసాయన ఎరువులు, పురుగుమందులు, జంతు వ్యర్థాలు మొదలైన వాటి వల్ల చెరువులు కలుషితం అవుతుంటాయి.
కలుషితమైన చెరువులను శుద్ధి చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే, స్థానిక సంస్థలు ఈ సమస్యపై అధిక దృష్టిని సారించాలి. విడతలవారీగా చెరువుల్ని శుభ్రం చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా కొంత బడ్జెట్‌ను కేటాయించాలి. ఎలాగూ కొత్త మున్సిపల్ చట్టం గ్రీన్ బడ్జెట్‌ను ఖర్చు చేసేందుకు అనుమతినిస్తుంది కాబట్టి.. ఆయా బడ్జెట్‌ను చెరువుల పునరుద్ధరణ గురించి ఖర్చు చేయడానికి నిర్ణయం తీసుకోవాలి.
చెరువుల్ని కలుషితం చేయవద్దనే చైతన్యాన్ని ప్రజల్లో తేవాలి.
చెరువులు కలుషితం అవ్వడం వల్ల కలిగే నష్టాల్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
స్థానిక సంస్థలు ఘన, ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలి.
చెరువులను కాపాడుకుందామిలా..
పటాన్‌చెరులో టన్నుల కొద్దీ చెరువులు చనిపోవడం బాధాకరమైన సంఘటన. చెరువులో ఆక్సిజన్ నిష్పత్తి తగ్గిపోవడం వల్ల చేపలు మరణించాయని ప్రాథమిక అంచనా. అయితే, కలుషితమైన చెరువుల్ని పరిశుభ్రం చేయడం కష్టమైనదేం కాదు. ఇప్పటికే ఇజ్రాయేల్, జపాన్ వంటి దేశాలు ఈ విషయంలో మనకంటే ఎంతో ముందంజలో ఉన్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని అధికారులు అడుగు ముందుకేయాలి. సమస్యను పరిష్కరించడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకోవాలి. తొలుత హైదరాబాద్‌లో ఏదైనా ఒక చెరువును శాంపిల్‌గా తీసుకుని.. పరిశుభ్రం చేసి చూపెట్టాలి. అదేరీతిలో మిగతా చెరువుల్ని కూడా పరిశుభ్రం చేయాలి.