poulomi avante poulomi avante

రెండున్న‌ర ల‌క్ష‌ల కోట్లు.. 12-20 ఏళ్లు ప‌డుతుందా?

  • మూసీ సుందరీకరణకు 1.5 లక్షల కోట్లు: సీఎం రేవంత్
  • మూసీ ప్రక్షాళణ, సుందరీకరణసాధ్యమవుతుందా?
  • తెలంగాణ సర్కార్ లక్షల కోట్లు ఖర్చుచేస్తుందా?
  • మూసీ నదిలో మురుగునీరు కలవకుండా అపగలమా?
  • స్వచ్ఛమైన నీరు ప్రవహించే మూసీని చూడ‌గ‌ల‌మా?

పాతబస్తీని ఇస్తాంబుల్ గా మారుస్తామని, హుస్సేన్ సాగర్ ను శుద్ది చేస్తామని, మూసీని లండన్ లోని థేమ్స్ న‌ది త‌ర‌హాలో తీర్చిదిద్దుతామని చాలా కాలం నుంచి పాలకులు చెబుతున్నారు. గత కొన్నేళ్ల నుంచి ఇవన్నీ ప్రకటనలకే పరిమితం అవ్వడం తప్ప ఆచరణలోకి మాత్రం రావడం లేదు. మూసీ ప్రక్షాళన చేస్తామని గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పగా.. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా.. లక్షా యాభై వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ నగరానికి పునాది పడక ముందు నుంచి ప్రవహిస్తున్న.. మూసీ నది ప్రక్షాళన సాధ్యమేనా? మూసీ సుందరీకరణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూర్చగలదా? అసలు మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు పట్టాలెక్కేనా?

సుమారు 430 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ మహా నగరానికి ఒకప్పుడు మూసీ నది మణిహారం అని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే మూసీ నది ఆధారంగానే హైదరాబాద్ నగర నిర్మాణం జరిగింది. హైదరాబాద్ కు చార్మినార్ తోపాటు మూసీనది, హుస్సేన్‌ సాగర్, పాతబస్తీలు ప్రధాన చిహ్నాలుగా మారాయి. సుమారు మూడు దశాబ్ధాల పాటు హైదరాబాద్‌కు త్రాగునీటిని అందించిన మూసి నది.. కాలక్రమేణా మురుగు కూపంగా మారిపోయింది. ప్రసుతం మూసీ నది నీటిని త్రాగటం సంగతి పక్కన పెడితే.. కనీసం ఆ పరిసరాల్లో నిలబడ్డానికే వీలు లేని విధంగా తయారైంది. హైదరాబాద్ సిటీ జనాభా పెరిగిపోవడం.. విస్తరిస్తున్న నగరంలో సరైన మురుగు నీటి వ్యవస్థ లేకపోవడంతో మూసీ నది కలుషితమైంది. ముక్కుపుటాలు అదిరేలా, కంపు వాసనతో బాగు చేయలేనంతగా పాడైపోయింది.

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుపెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా చాలా ప్రభుత్వాలు మూసీ నది ప్రక్షాళన చాలా హామీలిచ్చాయి. కానీ ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇందుకు వేల కోట్ల రూపాయల నిధుల కొరత ఒకటైతే.. చిత్తశుద్దితో కూడన సరైన ప్రణాళిక లేకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్, మూసీ నది ప్రక్షాళనకు ప్రయత్నించింది. మరీ ముఖ్యంగా మూసీ నది అభివృద్ధికి సంబంధించి.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పదుల సంఖ్యలో ప్రణాళికలు సిద్ధం చేసింది. మూసీనది ప్రక్షాళన, సుందరీకరణ కోసం ఏకంగా మూసీ రివర్ డెవ‌ల‌ప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. కానీ, సదరు ప్రణాళికలేవి కార్యరూపం దాల్చలేదు.
మురుగు నీరు, పారిశ్రామిక మూసీనదిలోకి తీసుకొచ్చే నాలాలను మళ్లించే ప్రయత్నంలో అప్పటికే అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్ర‌భుత్వం మూసీ నది పొడవునా భారీ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని సంకల్పించింది. మంచిరేవుల నుంచి నాగోల్ వ‌ర‌కూ నిర్మించ తలపెట్టిన ఈ ఎక్స్‌ప్రెస్‌ వే కోసం ఏకంగా 10 వేల కోట్ల మేరకు ఖర్చుఅవుతుందని అంచ‌నా వేశారు. మూసీ నదిపై మొత్తం 15 భారీ వంతెనలను నిర్మిస్తామని అప్పటి మంత్రి కేటీఆర్ చెప్పినా.. అవేవీ కార్యరూపం దాల్చలేదు. మూసీ నది సుందరీకరణకు సంబంధించిన పనులను మొదలు పెట్టే సమయంలోనే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తరువాత నవంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో.. కాంగ్రెస్ గెలిచి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇదిగో ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ ప్రక్షాళన పై దృష్టి సారించింది. మూసీ నదిని ఒక లక్షా 50 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మూసీ సుందరీకరణ పనులను త్వరలోనే మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. లండన్ లో ఉన్న ప్రఖ్యాత థేమ్స్ న‌దిలా మూసీని సర్వాంగ సుందరంగా, పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ అంటేనే ముక్కు మూసుకుని పరిస్థితుల నుంచి వచ్చే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు మూసీని సందర్శించేలా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు ఐదేళ్లలో లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేయడం అయ్యే పనేనా అన్న నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ ప్రకటించిన దాని ప్రకారం ఏడాదికి 30 వేల కోట్లు మూసీ నది అభివృద్ధి కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఆరు గ్యారంటీల అమలు, ఇతర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, లక్షల కోట్ల అప్పులు, వడ్డీలు.. వీటికే లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మూసీ నది కోసం.. ఐదేళ్లలో లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేయడం సాధ్యమయ్యే పనేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణకు కేవలం డబ్బు ఖర్చు చేస్తే సరిపోదని, కొన్నేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన చాలా వ్యవస్థలను చక్కదిద్దాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. మూసీ నదిపై ప్రస్తుతం 20 చిన్న,పెద్ద వంతెనలున్నాయి. ప్రతి రోజూ మూసీపై సుమారు 30 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, వచ్చే పదేళ్లలో ఈ సంఖ్య 60 లక్షలకు చేరుతుందని అంచనా. భవిష్యత్తు వాహనాల రద్దీని తట్టుకునేలా మూసీ నదిపై.. కొత్తగా 16 నుంచి 18 ప్రాంతాల్లో కొత్తగా వంతెనలు నిర్మించాలని గతంలో అధికారులు సూచించారు.
ఇక మూసీనది పరిసరాల్లో.. సుమారు 50 కిలోమీటర్ల మేర ఆక్రమణలకు గురైంది. ఆ ఆక్రమణలను తొలగించడం అంత ఆషామాషీ విష‌య‌మేం కాదని నిపుణులు అంటున్నారు. మరోవైపు నగర శివారుల్లో ఉన్న ఇండస్ట్రీస్ నుంచి పారిశ్రామిక వ్యర్ధాలు మూసీలో కలవకుండా ఆపాల్సి ఉంటుంది. మూసీలో ఉన్న యేళ్ల తరబడి పేరుకు పోయిన పొదలు తొలగించి, మురుగు నీరు నిల్వ ఉండకుండా పారించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నగరంలో మురుగునీరు, చెత్త, ఇతర వ్యర్థాలు మూసీలో కలవకుండా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మూసీలో సుమారు 30 ప్రాంతాల్లో చెక్ డ్యాంలు నిర్మించి మురుగు నీటి శుద్ధి వ్యవస్థలు అభివృద్ది చేయాలి. అప్పుడే మూసీ ప్రక్షాళన పాటు సుందరీకరణకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు లక్షా 50 వేల కోట్ల నిధులు ఏ మాత్రం సరిపోవని.. సుమారు రూ. 2 లక్షల కోట్ల నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే అంత భారీ మొత్తంలో లక్షల కోట్లు ఖర్చు చేయడం తెలంగాణ సర్కార్ కు సాధ్యమయ్యే పనేనా అన్నదే అందరిలో మెదిలే ప్రశ్న. దశల వారీగా మూసీ ప్రక్షాళనకు నిధులు ఖర్చు చేసినా కనీసం 12 నుంచి 20 ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles