తారామతిపేట నుంచి నాగోల్, ఎంజీబీఎస్ మీదుగా నార్సింగి దాకా మెట్రో రైలును చేరుస్తూ ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలుపై ఆయన ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ రివర్ ఫ్రంట్ కారిడార్‌లో భాగంగా ఈస్ట్ మరియు వెస్ట్ కారిడార్‌ను అనుసంధానం చేస్తూ ప్రణాళికల్ని సిద్ధం చేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలకు ఆదేశాలను జారీ చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ అవసరాలను తీర్చే విధంగా సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి గ్రోత్ హోబ్ లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికల్ని రూపొందించాలని సీనియర్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్ట్ ప్రాంతం నుండి కందుకూరు వరకు మెట్రో రైలు కనెక్టివిటీని ప్లాన్ చేయాలన్నారు, ఇక్కడ ఫార్మా సిటీ కోసం ఇప్పటికే సేకరించిన భూములలో మెగా టౌన్‌షిప్ ను ఏర్పాటు చేయవచ్చన్నారు. మెట్రో ఫేజ్-III ప్రణాళికలు జేబీఎస్ మెట్రో స్టేషన్ నుండి షామీర్‌పేట వరకూ విస్తరించాలన్నారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, సీఎంవో సెక్రటరీ షాజనవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
This website uses cookies.