2% స్టాంప్ డ్యూటీ తగ్గించాలి
అప్పుడే రియాల్టీ మార్కెట్ రివైవ్
సర్కార్ సానుకూలంగా స్పందించాలి
రిజిస్ట్రేషన్‌లో మహిళలకు రాయితీనివ్వాలి
హైదరాబాద్ రియాల్టీ ఎందుకు రోజురోజుకీ పతనం అవుతున్నది? ఇన్వెస్టర్లకు ఎందుకు రేవంత్ సర్కార్ మీద నమ్మకం పోతుంది? రియల్ రంగం రివైవ్ అవ్వాలంటే.. రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయాల్ని తీసుకోవాలి?
ఎయిర్ పోర్టు మెట్రో రూటు.. ఫార్మా సిటీ.. రద్దు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత.. హైదరాబాద్ రియాల్టీ మార్కెట్లో ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. ఇన్వెస్టర్లు, ఎన్ఆర్ఐలు బిత్తరపోయారు. నగరం నుంచి దాదాపుగా నిష్క్రమించారు. కొందరేమో ఏపీ వైపు దృష్టి సారించడం మొదలెట్టారు. ఆతర్వాత రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రూటును మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ లోపు పార్లమెంట్ ఎన్నికలు రావడం… కేంద్రంలో ఎన్‌డీఏ సర్కార్ ఏర్పడటం జరిగిపోయింది. మరి, ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్.. భూముల మార్కెట్ విలువల్ని సవరిస్తామంటూ ప్రకటించారు. అసలే మార్కెట్ మెరుగ్గా లేదని డెవలపర్లంతా గగ్గోలు పెడుతుంటే..
మళ్లీ ఈ పిడుగులాంటి వార్తేమిటని మల్లగుల్లాలు పడుతున్నారు. మరి, ఈ వాస్తవ పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డికి అర్థం కావట్లేదా? అర్థమైనా.. అర్థం కానట్లు ఊరుకుంటున్నారా? ఆయన సలహాదారులెవరూ మార్కెట్ స్థితిగతుల గురించి సీఎంకు వివరించట్లేదా? ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని తెలియట్లేదా? అని నిపుణులు అనుకుంటున్నారా? ఏదీఏమైనా హైదరాబాద్ రియల్ రంగం రివైవ్ అవ్వాలంటే.. రేవంత్ సర్కార్ తక్షణమే పలు కీలక నిర్ణయాల్ని తీసుకోవాలి. అప్పుడే మార్కెట్ గాడిలో పడుతుంది.
అసలే రియాల్టీ మార్కెట్ మెరుగ్గా లేదంటే.. ప్రభుత్వమేమో భూముల మార్కెట్ విలువల్ని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రతువును శాస్త్రీయకోణంలో చేపడితే ఎవరికీ ఇబ్బంది ఉండకపోవచ్చు. మార్కెట్లో నెలకొన్న వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేసుకుని ఈ ప్రక్రియను మొదలెడితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కరోనా సమయంలో రియల్ రంగాన్ని ప్రోత్సహించడానికి రెండు శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని అప్పటి ప్రభుత్వాన్ని క్రెడాయ్ హైదరాబాద్ కోరింది. ఆ అంశానికి గల సానుకూలాంశాల్ని గమనించిన అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం రెండు శాతం స్టాంప్ డ్యూటీని తగ్గించింది. దీంతో, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ వంటి సినిమా ప్రముఖులు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. మరి, ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ రియల్ రంగం రివైవ్ అవ్వాలంటే..
ఆరు నెలలు లేదా ఏడాది పాటు స్టాంప్ డ్యూటీని తగ్గించాలి. దీంతో, ఒక్కసారిగా పడుకున్న రియల్ రంగం మళ్లీ లేచి నిలబడుతుంది. రెండు శాతం స్టాంప్ డ్యూటీ తగ్గిందని అనుకోవడం కంటే.. రిజిస్ట్రేషన్లు పెరిగి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇదివరకే, ఈ విషయం నిరూపితమైంది కాబట్టి.. రేవంత్ సర్కార్ ఈ అంశంపై సానుకూలంగా వ్యవహరించాలని రియాల్టీ వర్గాలు కోరుతున్నాయి.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు రిజిస్ట్రేషన్‌లో ప్రత్యేక రాయితీని ప్రకటించారు. ప్రస్తుతం కూడా స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునే మహిళలకు ఒక శాతం రిజిస్ట్రేషన్‌ను తగ్గించాలి. ఇలాంటి వెసులుబాటును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తే మెరుగ్గా ఉంటుందని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రియాల్టీ పరిశ్రమకు ప్రభుత్వం సరైన ప్రోత్సాహాకాల్ని అందించాలని కోరారు. మార్కెట్ విలువలను పెంచేందుకు తామేమీ వ్యతిరేకం కాదని కాకపోతే సైంటిఫిక్‌గా ప్రక్రియను నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.
గత ప్రభుత్వ హయంలో కమర్షియల్ రిటైల్ అంశంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా తగు జాగ్రత్తల్ని తీసుకోవాలని సూచించారు. వాణిజ్య సముదాయాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో మార్కెట్ విలువ రూ.6600 పెట్టారని.. అదే భవనంలో టాప్ ఫ్లోరులోనూ అంతే విలువను పొందుపరిచారని గుర్తు చేశారు. కాకపోతే, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న రేటు పై అంతస్తుల్లో ఉండదనే వాస్తవాన్ని విస్మరించాని అన్నారు. అందుకే, అలాంటి తప్పిదాలు ఈసారి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎందుకంటే, ఒక్కసారి రూ.6600గా ధరను నిర్ణయిస్తే.. దానిపై జీఎస్టీ కట్టాలి. ఇన్‌కమ్ ట్యాక్స్‌లోనూ చూపెట్టాలని వివరించారు. వాస్తవానికి, కమర్షియల్ బిల్డింగుల్లో గ్రౌండ్ ఫ్లోరులో ఉన్న ధర పై ఫ్లోర్లకు వర్తించదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
This website uses cookies.