విపరీతంగా పెరిగిన ప్రీలాంచులు
అధికమైన రియల్ మోసాలు
చేతులెత్తేసిన నిర్మాణ సంఘాలు
బిచాణా ఎత్తేస్తున్న రియల్టర్లు
ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలి
హైదరాబాద్‌లో 2018 నుంచి పెరిగిన భూముల రేట్లు.. ఇప్పుడు కొనకపోతే మరెప్పుడూ కొనలేరనే విపరీతపు ప్రచారం.. భాగ్యనగరంలో ఏదో అద్భుతం జరుగుతుందంటూ జరిగిన గోబెల్స్ ప్రచారం.. కోకాపేట్‌లో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటల్లో ముందే జరిగిన అండర్ కరెంట్ ఒప్పందాలు.. అక్రమ రీతిలో అనుమతుల మంజూరు.. ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం..
మరోవైపు, యూడీఎస్ అమ్మకాలు.. తెలంగాణ ప్రజల సొమ్మును పొరుగు రాష్ట్రాల రియల్టర్లు దోచుకోవడం.. నిర్మాణ సంఘాల బిల్డర్లు ప్రీలాంచులు చేయడం.. బిచాణా ఎత్తేస్తున్న పలువురు రియల్టర్లు.. వరుసలో నిల్చున్న మరికొంత మంది రియల్టర్లు..
మొత్తానికి, కలుషితమైన నిర్మాణ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రక్షాళన చేయాలి. సీఎం రేవంత్‌రెడ్డి ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. హైదరాబాద్ రియల్ రంగంలో గత ఐదేళ్లలో జరిగిన మోసాల ప్రభావం ప్రస్తుతం రేవంత్ సర్కార్ ఏలుబడిలో బయటికొస్తున్నాయి. కాబట్టి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డియే ప్రక్షాళన చేసి కాపాడాలి.
2018 నుంచి హైదరాబాద్ రియాల్టీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ప్రజల సొమ్ముతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే డెవలపర్ల సంఖ్య పెరిగింది. కొందరు స్థల యజమానులు, ఏజెంట్లు, ఇతర వృత్తులకు చెందినవారు.. రియల్ రంగంలోకి అడుగుపెట్టారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు నగరానికొచ్చి యూడీఎస్, ప్రీలాంచుల్ని మొదలెట్టారు. బై బ్యాక్ స్కీముల్ని ఆరంభించారు. కమర్షియల్, రిటైల్ స్థలాల పేరిట.. నెలకు అద్దెలిస్తామంటూ ప్రకటనల్ని గుప్పించారు. ముక్కూమొహం తెలియని వారూ కోట్లాది రూపాయల్ని వసూలు చేశారు. వీరందరి ఉద్దేశ్యం ఒక్కటే.. ఏదో రకంగా ప్రజల నుంచి సొమ్ము వసూలు చేయడమే. లేఅవుట్ డెవలప్ చేస్తామో లేదో తర్వాత.. ముందైతే తక్కువ రేటు పేరిట డబ్బు వసూలు చేయాలన్నదే వీరి ఎజెండాగా మారింది.
యూడీఎస్, ప్రీలాంచులంటూ ప్రకటనల వర్షం గుప్పించి.. కోట్లాది రూపాయల్ని వసూలు చేసి.. ఆ సొమ్మేం చేయాలో తెలియక.. వాటాలో కీచులాటలు మొదలై.. ఒకరి మీద మరొకరు కేసులు పెట్టుకున్న డెవలపర్లు ఉన్నారు. అలాంటి వారికి గత ప్రభుత్వం అండదండలు విపరీతంగా ఉండేవి. అసలీ యూడీఎస్, ప్రీలాంచుల మోసగాళ్లకు ప్రభుత్వంలోని ఎవరో ఒకరి అండ మాత్రం కచ్చితంగా ఉండేది. ఏకంగా సీఎంవో కార్యాలయంతో కూడా ప్రత్యేక పరిచయాలుండేవి. అందుకే, వారేం చేసినా, ఎంతమంది ప్రజలు ఫిర్యాదు చేసినా, పోలీసులు కేసుల్ని నమోదు చేయడానికి వెనకడుగు వేసేవారు. అయితే, రేవంత్ సర్కార్ అధికారంలోకి రావడంతో.. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఫలితంగా, ఒక్కొక్కరు నెమ్మదిగా ప్రజల నెత్త మీద శరగోపం పెట్టి బిచాణా ఎత్తేస్తున్నారు. ఇదే బాటలో ఇంకొందరు సిద్ధంగా ఉన్నారు.
తెలంగాణ రాక ముందు వరకూ ఉన్న నిర్మాణ సంఘాల్లోని కొందరు పెద్దలు డెవలపర్లు ఎదుర్కొనే వాస్తవిక సమస్యలపై దృష్టి పెట్టేవారు. ప్రభుత్వంతో చర్చించి.. అధికారులకు అర్థమయ్యేలా సమస్య తీవ్రతను వివరించి.. అనేక సమస్యలను పరిష్కరించేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చన తొలినాళ్లలో ఈ పరిస్థితి ఉండేది. అయితే, గత కొంతకాలంగా నిర్మాణ సంఘాలు ఈ రంగం ఎదుర్కొనే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది తక్కువే అని చెప్పాలి. ప్రభుత్వ పెద్దలతో టచ్‌లో ఉండటం వల్ల.. బిల్డర్ల ఇబ్బందుల గురించి బయట ఎక్కడా చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు. ఫలితంగా, హైదరాబాద్ నిర్మాణ రంగానికి పెద్దగా ప్రయోజనమేమీ కలగలేదు. నేటికీ, నగరంలో చిన్న బిల్డర్లు నేటికీ సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. వీరి సమస్యలు కనీసం కొత్త ప్రభుత్వంలోనైనా పరిష్కారం అవుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు.
నిర్మాణ సంఘాలకు చెందిన కొందరు పెద్దలు స్వీయ నియంత్రణను పాటించారు. ఎవరెన్ని చెప్పినా, కొనుగోలుదారులే స్వయంగా అడిగినా.. ప్రీలాంచుల్ని మాత్రం చేయలేదు. వ్యాపారంలో వెనకపడినా ఫర్వాలేదనుకున్నారు. కానీ, ఇతర సంఘ సభ్యులు ప్రాథమిక సూత్రాన్ని పట్టించుకోకుండా.. ఇబ్బడిముబ్బడిగా ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించారు. ఇలా చేయకపోతే వ్యాపారంలో వెనకపడిపోతామని ఇష్టం వచ్చినట్లు ప్రజల్నుంచి సొమ్ము లాగేశారు. ఇప్పుడిక ప్రతి నిర్మాణ సంఘంలో బిల్డర్లు రెండు రకాలుగా చీలిపోయారు. ప్రీలాంచులు చేసేవారు ఒకవైపు.. వాటిని చేయని వారు మరోవైపు ఉన్నారు. వీరిని నియంత్రించడంలో నిర్మాణ సంఘాలూ పూర్తిగా విఫలమయ్యాయి. ఆరంభంలోనే వీటికి అడ్డుకట్ట వేస్తే బాగుండేది. కానీ, ఎందుకో కానీ, ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. గతంలో అపార్టుమెంట్లు కట్టనివారు సైతం.. సోషల్ మీడియాలో ప్రీలాంచ్‌లో ఫ్లాట్లంటూ ప్రచారం చేసి అమాయకుల నుంచి సొమ్ము లాగేస్తున్నారు. ఈమధ్య కాలంలో బిచాణా ఎత్తేస్తున్న వారిలో వీరే ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని గుర్తించాలి.
మొత్తానికి, ప్రీలాంచుల్ని చేసే వారిని నిర్మాణ సంఘాలు నియంత్రించలేవు. అక్రమ రీతిలో అమ్మకూడదని నోరు తెరిచి గట్టిగా చెప్పలేవు. ఎందుకంటే, అక్రమరీతిలో అమ్మేది మొత్తం తెలిసిన మిత్రులే. కాబట్టి, ప్రభుత్వమే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని.. కలుషితమైన నిర్మాణ రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఇందుకోసం కొంత కఠినంగా వ్యవహరించాలని అధిక శాతం మంది డెవలపర్లు కోరుతున్నారు.
This website uses cookies.