ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ హైదరాబాద్, బెంగళూరుల్లోని తన కార్యాలయ ఆస్తులను విక్రయించాలని యోచిస్తోంది. నాన్ కోర్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 10 ఎకరాల క్యాంపస్ తోపాటు చెన్నై సిరుసేరిలో 14 ఎకరాల క్యాంపస్ ను విభజించి విక్రయించాలని యోచిస్తోంది. అలాగే వ్యయ నియంత్రణ ప్రణాళికలో భాగంగా రెండేళ్లలో 400 మిలియన్ డాలర్లను ఆదా చేయడానికి 11 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను కూడా ఖాళీ చేయనుంది. కాగ్నిజెంట్ కంపెనీ తన మొత్తం రియల్ ఎస్టేట్ పోర్ట్ ఫోలియోను మూల్యాంకనం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అద్దెకు తీసుకున్న ఆస్తులను ఖాళీ చేసింది. కొన్ని చోట్ల యజమానులతో మాట్లాడి అద్దె ఒప్పందాలు కూడా తగ్గించుకుంది. కాగ్నిజెంట్ హైదరాబాద్ లోని 10 ఎకరాల స్థలంలో దాదాపు 2.5 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం కలిగి ఉంది. అలాగే కోవిడ్ ముందు హైదరాబాద్ లో 1.5 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ తీసుకోవాలని భావించగా.. ఇప్పుడు దానిని ఒక మిలియన్ చదరపు అడుగుల వరకు తగ్గించుకుంది.