- 3-5 ఏళ్లలో 10-20 శాతం మేర పెరగనున్న ప్రాపర్టీ ధరలు
- మెట్రో ఫేజ్-2 నేపథ్యంలో పెరుగుదల
- కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ రియల్ బూమ్ రానుంది. మెట్రో ఫేజ్-2 నేపథ్యంలో శివారు ప్రాంతాల్లోని ప్రాపర్టీ ధరలు వచ్చే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో 10 నుంచి 20 శాతం మేర పెరగనున్నాయని కొలియర్స్ ఇండియా తాజా నివేదిక అంచనా వేసింది.
రెసిడెన్షియల్ మార్కెట్ తో పాటు కమర్షియల్ రియల్ ఎస్టేట్ ల్యాండ్ స్కేప్ లోనూ శివారు ప్రాంతాలు కీలకంగా మారనున్నాయని పేర్కొంది. అలాగే రాబోయే సంవత్సరాల్లో గ్రేడ్ ఏ ఆఫీస్ స్టాక్‌లో 12-15%, వార్షిక ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో 5-10% శివారు కీలకమవుతాయని తెలిపింది. హైదరాబాద్ మెట్రో-2 విస్తరణ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధి పెరగడానికి కారణం కానుందని వివరించింది. మెట్రో ఫేజ్-2లో నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, రాయదుర్గం నుంచి కోకాపేట వరకు విస్తరించనున్నారు.
“హైదరాబాద్ కార్యాలయ మార్కెట్ పరిణతి చెందుతూనే ఉంది. 2024 నాటికి భారతదేశంలోని టాప్ 6 నగరాల్లోని డిమాండ్‌లో ఐదో వంత, అలాగే కొత్త సరఫరాల నాలుగో వంతు హైదరాబాదే తీర్చనుంది’’ అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అర్పిత్ మెహ్రోత్రా అన్నారు. కాగా, కోకాపేట, నియోపోలిస్ నార్సింగి సహా హైదరాబాద్‌లోని పశ్చిమ శివార్లలో గత ఐదు సంవత్సరాలలో ఇళ్ల ధరలు 50% పైగా పెరిగాయని, ఇంకా 10-15% పెరుగుదల ఉంటుందని నివేదిక పేర్కొంది.
ఈ ప్రాంతాలు ఉన్నత స్థాయి నివాస అభివృద్ధికి కేంద్రంగా ఉండగా.. తెల్లాపూర్, లింగంపల్లి, బండ్లగూడ, మియాపూర్‌లలో సరసమైన మరియు మధ్యస్థ-విభాగ గృహాలు విస్తరిస్తాయని భావిస్తున్నట్టు తెలిపింది. పశ్చిమ ప్రాంతాల్లో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ డిమాండ్, సరఫరా రెండూ అనేక రెట్లు పెరుగుతాయని అంచనా వేసింది. దీనివల్ల మైక్రో మార్కెట్‌లో గ్రేడ్ ఏ ఆఫీస్ స్టాక్ రెట్టింపు అయి రాబోయే 3 నుంచి ఐదేళ్లలో 22 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది.