- 20 రాష్ట్రాల్లో 1.1 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ల నమోదు
దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి తీసుకొచ్చిన రెరా అదరగొడుతోంది. అటు కొనుగోలుదారులకు, ఇటు డెవలపర్లకు మధ్య వారధిలా పనిచేస్తున్న రెరా.. రిజిస్ట్రేషన్ల విషయంలో కోటి మార్కు దాటింది.
2017లో రెరా తీసుకురాగా, ఇప్పటివరకు దేశంలోని 20 రాష్ట్రాల్లో 1.1 కోట్లకు పైగా యూనిట్లు సహా 1.43 లక్షల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇందులో రిజిస్టర్ అయ్యాయి. ఈ వివరాలను ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. 2022-2024 మధ్య రెరాలో నమోదైన ప్రాజెక్టుల సంఖ్య 21 శాతం తగ్గింది. అయితే, 2020 మరియు 2022 క్యాలెండర్ సంవత్సరాల మధ్య ఇది 145 శాతం పెరిగి 25,281 ప్రాజెక్టులకు చేరుకుంది. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా 48,047 ప్రాజెక్టులతో మహారాష్ట్ర టాప్ లో నిలవగా.. టాప్-10 రెరా రాష్ట్రాల్లో మొత్తం నమోదైన ప్రాజెక్టుల్లో 40 శాతం వాటా చేజిక్కించుకుంది.
19,987 ప్రాజెక్టులతో తమిళనాడు 17 శాతం వాటాను కలిగి ఉండగా, 16,265 ప్రాజెక్టులతో గుజరాత్ 14 శాతం వాటాను కలిగి ఉంది. టాప్-10 రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే, 2017-2024 మధ్య ఈ రాష్ట్రాల్లో 97.14 లక్షల యూనిట్లతో కూడిన 1.19 లక్షల ప్రాజెక్టులు రెరాలో రిజిస్టర్ అయ్యాయి. అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులు నమోదైన టాప్-10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.