- 11 మిలియన్ చదరపు అడుగుల నుంచి 23 మిలియన్ చ.అ.కు చేరే అవకాశం
- ఇందులో సగం ముంబైలోనే.. మిగిలింది చెన్నై, హైదరాబాద్ లలో..
- కొలియర్స్ తాజా నివేదిక వెల్లడి
దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం వచ్చే మూడేళ్లలో రెట్టింపు అవుతుందని.. ఈ విభాగంలోకి మొత్తం 10 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు వస్తాయని కొలియర్స్ తాజా నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి 11 మిలియన్ చదరపు అడుగుల్లో డేటా సెంటర్లు ఉండగా.. 2026 నాటికి ఇవి 23 మిలియన్ చదరపు అడుగులకు చేరతాయని అంచనా వేసింది. 2023-26లో రాబోయే సరఫరాలో సగం మేర ముంబైలోనే ఉంటుందని.. మిగిలింది చెన్నై, హైదరాబాద్ లో వస్తుందని పేర్కొంది.
డేటా వినియోగం, క్లౌడ్ అడాప్షన్ లో పెరుగుదల కారణంగా 2020 నుంచి డేటా సెంటర్ల సామర్థ్యం రెండు రెట్లు పెరిగింది. దీంతో కరోనా తర్వాత ఈ విభాగం గణనీయమైన వృద్ధిని సాధించింది. 2023 ఆగస్టు నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 819 మెగావాట్ల సామర్థ్యంతో 11 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. డేటా వినియోగంలో విపరీతమైన పెరుగుదలతోపాటు ఈ విభాగంలో బలమైన పెట్టుబడుల వల్ల డేటా సెంటర్ సామర్థ్యం 2026 నాటికి 1800 మెగావాట్లను దాటుతుందని అంచనా. అలాగే ప్రస్తుతం ఉన్న 11 మిలియన్ చదరపు అడుగుల నుంచి 23 మిలియన్ చదరపు అడుగులకు చేరుతుందని భావిస్తున్నారు.