రెండు కేసుల్లో వినియోగదారుల కమిషన్ తీర్పు
చేసుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణాలను పూర్తి చేయకపోవడం సేవాలోపం కిందకు వస్తుందని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకున్న భూమి యజమానులకు పరిహారం చెల్లించాలని, అంతేకాకుండా డిజైన్ ప్రకారం అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్ కు చెందిన డిజైన్ అండ్ కన్ స్ట్రక్ట్, మోహిత్ ఇన్ ఫ్రా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు వేర్వేరు కేసులు విచారించిన కమిషన్ సభ్యులు వి.వి.శేషుబాబు, ఆర్ఎస్ రాజశ్రీలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ తీర్పులు వెలువరించింది.
బోడుప్పల్ కు చెందిన సి.జైకుమార్ 226.27 చదరపు గజాల్లో రెండంతుస్తుల ఇంటి నిర్మాణం కోసం డిజైన్ అడ్ కన్ స్ట్రక్ట్ కంపెనీ సీఈఓ కృష్ణ వరుణ్ తో రూ.81 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, పనుల్లో తీవ్రమైన జాప్యం జరగడంతో ఒప్పందం రద్దు చేసుకుంటానని జైకుమార్ హెచ్చరించారు. దీంతో 2022 ఆగస్టుకల్లా పనులు పూర్తి చేస్తామని, లేకుంటే సెప్టెంబర్ నుంచి నెలకు రూ.50 వేల పరిహారంతోపాటు ఇప్పటివరకు జరిగిన జాప్యానికి రూ.5 లక్షలు చెల్లిస్తానని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును రూ.76 లక్షలకే పూర్తి చేస్తామని తెలిపింది. కానీ గడువులోగా పనులు పూర్తి కాలేదు. పైగా జరిగిన నిర్మాణంపై నిపుణులతో పరిశీలన జరిపించగా.. నాసిరకంగా ఉందని తేల్చారు. దీంతో జైకుమార్ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. అన్ని ఆధారాలనూ పరిశీలించిన కమిషన్.. నాసిరకం పనులను మళ్లీ చేయించడం కోసం రూ.6.47 లక్షలు చెల్లించాలని.. అలాగే నిర్మాణం కోసం చేసిన పని కంటే అధికంగా తీసుకున్న రూ.10.25 లక్షలను 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. అలాగే మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.లక్ష, ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని సూచించింది.
మరో కేసులో తప్పుడు పత్రాలతో కంపెనీ పెట్టి నిర్మాణం సరిగా చేయనందుకు మోహిత్ ఇన్ ఫ్రాకు కమిషన్ అక్షింతలు వేసింది. పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న సురేష్ కుమార్.. ఎంఐటీలో లైబ్రేరియన్ గా ఉంటున్న తన భార్య టి.రమాలత, కుమారుడు సాయి మోహిత్ పేరుతో తప్పుడు పత్రాలు ఉపయోగించి మోహిత్ ఇన్ ఫ్రా అనే కంపెనీ ఏర్పాటు చేశారు. గడ్డి అన్నారంలో నివాస గృహాల సముదాయం నిర్మాణానికి చదరపు అడుగు రూ.1450 చొప్పున 10396 చదరపు అడుగులతో మూడంతుస్తుల భవనం నిర్మించేందుకు జానకి సుబ్రమణియన్ తదితరులు మోహిత్ ఇన్ ఫ్రాతో ఒప్పందం కుదుర్చుకుని రూ.1.50 కోట్లు చెల్లించారు. అయితే, నిర్మాణం పూర్తి చేయకపోవడంతోపాటు నాసిరకం నిర్మాణం చేసినందుకు పగుళ్లు వచ్చాయి. దీంతో అసంపూర్తిగా పనులు వదిలిపెట్టారు. పైగా 10396 చదరపు అడుగుల నిర్మాణానికి ఒప్పందం కుదరగా.. తాము 13వేల చదరపు అడుగులు నిర్మించామని, బకాయిలు రావాలంటూ మోహిత్ ఇన్ ఫ్రా ఆర్బిట్రేషన్ కు వెళ్లింది. దీంతో బాధితులు వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించగా.. పెండింగ్ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని.. మానసిక వేదనకు రూ.లక్ష పరిహారం, ఖర్చుల కింద రూ.20వేలు చెల్లించాలని మోహిత్ ఇన్ ఫ్రాను ఆదేశించింది.