Categories: TOP STORIES

నిర్మాణ సంఘాలు నిల‌దీయ‌లేవా?

  • యూడీఎస్‌, ప్రీలాంచ్ చేసే బిల్డ‌ర్ల‌ను
  • నియంత్రించ‌డంలో సంఘాలు విఫ‌లం
  • కొంద‌రు బ‌డా డెవ‌లప‌ర్లు ఆడిందే ఆట‌..
  • హైద‌రాబాద్ బ్రాండ్ కు పెద్ద దెబ్బ‌!
  • అయినా ప‌ట్టించుకోని నిర్మాణ సంఘాలు
  • యూడీఎస్ బిల్డ‌ర్ల స‌భ్య‌త్వం ర‌ద్దు చేయాలి
  • ప్రీలాంచ్ చేసే వారిని ప‌క్క‌న పెట్టేయాలి

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌: 

యూడీఎస్ అమ్మ‌కాలు.. ప్రీ లాంచ్ ఆఫ‌ర్లు..
బై బ్యాక్ ఆఫ‌ర్లు.. హండ్రెడ్ ప‌ర్సంట్ పేమెంట్‌..
తెలంగాణ రియ‌ల్ రంగంలో పెరుగుతోన్న అక్ర‌మ దందాల‌కు నిద‌ర్శ‌న‌మీ ప‌థ‌కాలు. చోటా మోటా రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్లు, కాంట్రాక్ట‌ర్లే కాకుండా ఇత‌ర న‌గ‌రాల్నుంచి అనుభ‌వం లేనివారూ విచ్చేసి.. హైద‌రాబాద్‌లో ఈ అక్ర‌మ దందాకు తెర లేపారు. త‌క్కువ రేటంటూ కొనుగోలుదారులు, పెట్టుబ‌డిదారుల్ని మ‌భ్య పెడుతూ కోట్లు దండుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు గ‌ల హైద‌రాబాద్.. ఇలాంటి అక్ర‌మ దందాల కార‌ణంగా.. త‌న ప్రాభ‌వాన్ని కోల్పోయే ప్ర‌మాద‌ముంది. క‌ళ్ల ముందే భాగ్య‌న‌గ‌రం బ్రాండ్‌కు న‌ష్టం వాటిల్లుతుంటే.. తెలంగాణ నిర్మాణ సంఘాలెందుకు స్పందించ‌ట్లేదు? అక్ర‌మ లావాదేవీల‌ను చేప‌ట్టే బిల్డ‌ర్లు, రియ‌ల్ట‌ర్ల‌పై ఎందుకు చ‌ర్య‌ల్ని తీసుకోవ‌డం లేదు? వీరు నిమ్మ‌కు నీరెత్త‌కుండా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని చూసి.. నిర్మాణ సంఘాలు నిద్ర‌పోతున్నాయా? అనే సందేహం ప్ర‌జ‌ల‌కు క‌లుగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగం క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో అభివృద్ధి చెంద‌డంలో నిర్మాణ సంఘాలు విశేషంగా కృషి చేశాయి. త‌మ సంఘంలోని డెవ‌ల‌ప‌ర్లంతా రెరా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప్రాజెక్టుల్ని చేప‌ట్టేందుకు ప్రోత్స‌హించాయి. ఒక‌ట్రెండు సంఘాలైతే రెరా ప‌టిష్ఠంగా అమ‌లు కావ‌డంలో కీల‌క భూమిక‌ను పోషించాయి. మ‌రి, ఇలాంటి సంఘాలు ప్ర‌స్తుతం యూడీఎస్‌, ప్రీ లాంచ్ చేసే బిల్డ‌ర్ల‌ను క‌ట్ట‌డి చేయ‌డం లేదెందుకు? ఆయా సంఘాల బిల్డ‌ర్లు అక్ర‌మంగా సొమ్ము వ‌సూలు చేస్తున్నార‌ని తెలిసీ చూసీచూడ‌కుండా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నారు? ఇలా నిమ్మ‌కు నీరెత్త‌కుండా ఉండ‌టం వ‌ల్లే యూడీఎస్ సంస్థ‌లు పెట్రేగిపోతున్నాయి. త‌మ‌ను ప్ర‌శ్నించేవారే లేర‌ని విర్ర‌వీగుతున్నాయి. త‌మ గూడునే తాము న‌రుక్కుంటున్నామ‌ని తెలిసి కూడా నిర్మాణ సంఘాలు ప‌ట్టించుకోవ‌ట్లేదు. మ‌రి, ఎందుకీ వ్య‌వ‌హారంలో సంఘాలు నిర్లిప్తంగా మారాయి?

ఎవ‌రి గోల వారిదే..

సాధార‌ణంగా నిర్మాణ సంఘాల్లోని స‌భ్యులంద‌రూ క‌లిసిక‌ట్టుగానే క‌నిపించిన‌ప్ప‌టికీ.. అధిక శాతం బిల్డ‌ర్లు ఎవ‌రి గోల వారిదే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. నిర్మాణాలు చేప‌ట్టే ప్ర‌తి డెవ‌ల‌ప‌ర్‌కి నిత్యం ఏదో ఒక ఇబ్బంది ఎదుర‌వుతూనే ఉంటుంది. అందుకే, బిజీగా ఉండే డెవ‌ల‌ప‌ర్లు సంఘం వ్య‌వ‌హారాల మీద పెద్ద‌గా దృష్టి పెట్ట‌రు. ఈ క్ర‌మంలో చాలామంది డెవ‌ల‌ప‌ర్లు ఏదో ఒక సంఘంలో ఉండాలి కాబ‌ట్టి స‌భ్య‌త్వం తీసుకుంటారు. కొంద‌రైతే ద్వంద్వ స‌భ్య‌త్వం కూడా క‌లిగి ఉంటారు. కాబ‌ట్టి, నిర్మాణ సంఘాల నిర్వ‌హ‌ణ క‌మిటీకి కొంద‌రు స‌భ్యుల మీద ప‌ట్టు ఉంటుందే త‌ప్ప అంద‌రి మీద ఉండ‌దు. కాక‌పోతే, ఏదైనా స‌మ‌స్య వ‌స్తే మాత్రం.. అంద‌రూ ఒక‌టిగా మారి ఉన్న‌తాధికారుల‌కో ప్ర‌భుత్వానికో విన‌తి ప‌త్రం ఇచ్చి ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తారు. అయితే, కొన్ని సంఘాలేమంటాయి అంటే, రెరా అథారిటీయే రియ‌ల్ రంగంలో నెల‌కొన్న‌ ఈ గ‌డ్డు ప‌రిస్థితిని త‌ప్పించాల‌ని కోరుకుంటున్నాయి.

ప్ర‌భుత్వం ఫుల్ స‌పోర్టు .. అయినా!

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి నిర్మాణ రంగానికి ప్ర‌భుత్వం పూర్తి స‌హాయ స‌హ‌కారాల్ని అంద‌జేస్తోంది. ఏమైనా స‌మ‌స్య‌ల‌తో ప్ర‌భుత్వం వ‌ద్ద‌కెళితే ప‌రిష్కారం కావాల్సిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ఇలాంటి స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణం ఉన్న‌ప్ప‌టికీ.. నిర్మాణ సంఘాలు ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వ‌డంలో విఫ‌లం అవుతున్నాయి. ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ఠ తెచ్చే యూడీఎస్‌, ప్రీ లాంచ్ ప్రాజెక్టుల్ని విక్ర‌యించే నిర్మాణ సంస్థ‌ల్ని నియంత్రించ‌లేక పోతున్నాయి. క‌ళ్ల ముందే ప‌లు సంస్థ‌లు అక్ర‌మాలు చేస్తున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రేం చేస్తే మాకేం అన్న‌ట్టుగా కొన్ని సంఘాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఒక‌ట్రెండు సంస్థ‌లు స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేస్తున్న‌ట్లు క‌నిపించిన‌ప్ప‌టికీ, దాని వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం క‌నిపించ‌ట్లేదు. ఇప్ప‌టికైనా నిర్మాణ సంఘాలు యూడీఎస్‌, ప్రీ లాంచ్‌లో ప్లాట్లు, ఫ్లాట్ల‌ను అమ్మే సంస్థ‌ల‌ను దారిలోకి తేవాలి. ప్ర‌తి సంఘం త‌మ వ‌ద్ద ఇలాంటి అక్ర‌మాలు చేసేవారి జాబితాను విడుద‌ల చేయాలి. ఒక‌ట్రెండు సార్లు వినిపించుకోక‌పోతే, వెంట‌నే వాళ్ల‌ను నిర్మాణ సంఘం నుంచి తొల‌గించాలి. తెలంగాణ‌లోని మిగ‌తా ఏ సంఘంలోనూ వారిని చేర్చుకోకూడ‌దు. ప్ర‌భుత్వం కూడా ఆయా బిల్డ‌ర్ లైసెన్సును ర‌ద్దు చేయాలి. రెరా అథారిటీ అలాంటి బిల్డ‌ర్ల‌పై భారీ జ‌రిమానాను విధించాలి. ఇలా, క‌ట్టుదిట్టంగా వ్య‌వ‌హ‌రిస్తే.. ఈ యూడీఎస్ మరియు ప్రీలాంచ్ బెడ‌ద రాష్ట్రంలో త‌గ్గుతుంది.

మొద‌ట్లో అంతా ఒకే..

తెలంగాణ రెరా అథారిటీ ఏర్ప‌డిన త‌ర్వాత‌.. హైద‌రాబాద్ నిర్మాణ సంఘాల‌న్నీ ఊపిరి పీల్చుకున్నాయి. మొద‌ట్లో మ‌న‌ నిర్మాణ సంస్థ‌లు రెరా అనుమ‌తిని తీసుకునేందుకు పోటీప‌డ్డాయి. అస‌లు రెరా నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాక‌పోతే.. ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించ‌డానికే వెన‌క‌డుగు వేసేవి. రెరా అనుమ‌తి ఉంటేనే ప్రాజెక్టును ప్ర‌క‌టిస్తామ‌ని అనేక సంస్థ‌లు బాహాటంగా చెప్పేవి. కానీ, గ‌త కొంత‌కాలం నుంచి ఈ ప‌రిస్థితిలో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అస‌లు రెరా ఉంద‌నే సోయి లేకుండానే.. కొంద‌రు అక్ర‌మార్కులు యూడీఎస్‌, ప్రీ లాంచ్ ప్రాజెక్టుల్ని ప్ర‌క‌టిస్తున్నారు. అమాయ‌క మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, పెట్టుబ‌డిదారుల నుంచి ల‌క్ష రూపాయ‌ల్ని దండుకుంటున్నారు. వీరంతా రెరా ఉనికినే ప్ర‌శ్నార్థకం చేస్తుంటే.. తెలంగాణ రెరా అథారిటీ ఎందుకు చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది?

ఢిల్లీ లోని నొయిడా, గుర్గావ్ త‌ర‌హాలో మ‌న హైద‌రాబాద్ రియ‌ల్ రంగం పూర్తిగా కుప్ప‌కూలిపోయిన త‌ర్వాత రెరా నిద్ర లేస్తుందా? డెవ‌ల‌ప‌ర్లు, రియ‌ల్ట‌ర్లు అమాయ‌కుల్ని మోస‌గించి.. జైళ్లు, కోర్టుల చుట్టూ తిరిగే ప‌రిస్థితి వ‌చ్చేవ‌ర‌కూ ఎదురు చూస్తుందా? ఈ అక్ర‌మ లావాదేవీలన్నీ ప్ర‌భుత్వానికి కానీ పుర‌పాల‌క మ‌రియు రెరా ఉన్న‌తాధికారుల‌కు తెలిసే జ‌రుగుతున్నాయా? ఒక‌వేళ, ఇవ‌న్నీ ప్ర‌భుత్వం దృష్టిలో స‌క్ర‌మం అయితే.. తెలంగాణ రెరా అథారిటీ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం లేదు క‌దా?

This website uses cookies.