Categories: TOP STORIES

యూడీఎస్‌పై యుద్ధ‌భేరి!

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌: తెలంగాణ నిర్మాణ సంఘాల‌న్నీ యూడీఎస్, ప్రీలాంచ్ సేల్స్‌ని అరిక‌ట్టేందుకు క‌లిసిక‌ట్టుగా యుద్ధం ప్ర‌క‌టించాయి. బంజారాహిల్స్‌లోని క్రెడాయ్ హైద‌రాబాద్ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో.. రెరా అనుమ‌తి లేకుండా ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ కొన‌కూడ‌ద‌ని కొనుగోలుదారుల్ని కోరాయి. యూడీఎస్‌, ప్రీలాంచ్ సేల్స్ అనేవి నిర్మాణ రంగానికి ప‌ట్టిన పీడ అని.. వీటిని బారిన ప‌డి ఇబ్బందులు ప‌డ‌కూడ‌దంటే.. బ‌య్య‌ర్లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విన్న‌వించాయి. యూడీఎస్‌ సంస్థ‌ల‌పై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపాల‌ని అభ్య‌ర్థించాయి. బ‌య్య‌ర్లు, ప్ర‌భుత్వం ఏం చేయాలో సూచించాయి త‌ప్ప‌.. నిర్మాణ రంగాన్ని ప‌ట్టి పీడిస్తున్న‌ ఈ క్యాన్స‌ర్‌ను జ‌యించ‌డానికి నిర్ధిష్ఠ‌మైన ప్ర‌ణాళిక‌ను ర‌చించ‌డంలో నిర్మాణ సంఘాలు విఫ‌ల‌మ‌య్యాయ‌నే చెప్పాలి. రానున్న రోజుల్లోనైనా ప‌క్కా ప్ర‌ణాళిక‌ల్ని రచిస్తార‌ని ఆశిద్దాం. మొత్తానికి, శుక్ర‌వారం ప్రెస్ మీట్‌లో.. నిర్మాణ సంఘాల‌న్నీ క‌లిసి గాల్లో కాల్పులు జ‌రిపాయ‌ని చెప్పొచ్చు.

భార‌త‌దేశ నిర్మాణ రంగంలోనే ఎక్క‌డా లేని విధంగా.. తెలంగాణ నిర్మాణ సంఘాల‌న్నీ ఒక వేదిక మీదికొచ్చి యూడీఎస్‌, ప్రీలాంచ్ సేల్స్ వ్య‌తిరేకంగా గ‌ళం విప్పాయి. క్రెడాయ్ హైద‌రాబాద్‌, క్రెడాయ్ తెలంగాణ‌, ట్రెడా, టీబీఎఫ్‌, టీడీఏ నిర్మాణ సంఘాల‌న్నీ క‌లిసి యూడీఎస్‌, ప్రీలాంచ్ సేల్స్ మీద పోరును ప్ర‌క‌టించాయి. కార్య‌క్ర‌మంలో ముందుగా ప్ర‌సంగించిన క్రెడాయ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు రామ‌కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ రెరా అథారిటీ నిర్లిప్త‌త వ‌ల్ల యూడీఎస్‌, ప్రీలాంచ్ సేల్స్ పుట్టుకొచ్చాయ‌ని చెప్పారు. యూడీఎస్ ప్రాజెక్టుల‌కు భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల్ని నిలిపివేయాల‌ని.. ఆయా డెవ‌ల‌ప‌ర్ల మీద క‌ఠిన చ‌ర్య‌ల్ని తీసుకోవాల‌ని కోరారు. క‌నీసం ప‌ది మంది మీద అయినా చ‌ర్య‌లు తీసుకుంటే, మిగ‌తా వారు చేయ‌డానికి వెన‌కాడుతార‌ని తెలిపారు. ఈ క్యాన్స‌ర్ నుంచి నిర్మాణ రంగాన్ని కాపాడేందుకు ప్ర‌భుత్వం అతిత్వ‌ర‌గా మేల్కోవాల‌ని అభ్య‌ర్థించారు.

క్రెడాయ్ తెలంగాణ ఛైర్మ‌న్ రామ‌చంద్రారెడ్డి మాట్లాడుతూ.. రెరాను ఓవ‌ర్‌టేక్ చేసి ప్రీ సేల్స్ చేస్తున్న డెవ‌ల‌ప‌ర్ల‌ను కొనుగోలుదారులు గుర్తించాల‌న్నారు. ఆ ప్రాజెక్టు అంటూ ఆరంభం కాక‌పోతే కోర్టుల చుట్టూ తిర‌గాల్సిన దుస్థితి ఏర్ప‌డుతుంద‌న్నారు. ఇలాంటి మోస‌పూరిత డెవ‌ల‌ప‌ర్ల‌ను అరెస్టు చేయాల‌ని కోరారు. అధ్య‌క్షుడు ముర‌ళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. యూడీఎస్ డెవ‌ల‌ప‌ర్లు ప్ర‌జ‌ల‌తో చెల‌గాటం ఆడుతున్నార‌ని.. వీరిని ఆరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం క‌ఠిన నిబంధ‌న‌ల్ని ప్ర‌క‌టించాల‌ని విన్న‌వించారు. తెలంగాణ రెరా అథారిటీని బ‌లోపేతం చేయాల‌ని కోరారు. యూడీఎస్‌, ప్రీలాంచ్ అమ్మ‌కాల్ని చేప‌ట్టిన సంస్థ‌ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో అనుమ‌తుల్ని నిలిపివేయాల‌న్నారు.

ఇప్ప‌టికైనా.. న్యాయ‌బ‌ద్ధంగా..

ట్రెడా అధ్య‌క్షుడు చ‌ల‌ప‌తిరావు మాట్లాడుతూ.. ప్రీ అంటే ర‌క‌ర‌కాల అర్థాలు వ‌స్తాయ‌ని.. ఇక్క‌డ ప్రీ అంటే క‌న్ఫ‌ర్మ్ కాద‌ని.. న‌ష్ట‌భయంతో కూడుకున్నద‌నే విష‌యాన్ని గుర్తించాలి. అలా అంటే, అక్ర‌మ లేఅవుట్లుగా ప‌రిగ‌ణించాల్సిందేన‌ని అన్నారు. ఇంటి కొనుగోలుదారుల్ని ప‌రిర‌క్షించేందుకు మ‌న‌దేశంలో దాదాపు ప‌దేళ్లు ప‌ట్టింద‌ని గుర్తు చేశారు. ఢిల్లీలోని నొయిడాలో వంద శాతం సొమ్ము తీసుకుని ఫ్లాట్ల‌ను విక్ర‌యించినా అనేక‌మంది బిల్డ‌ర్లు వాటిని కొనుగోలుదారుల‌కు అప్ప‌గించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని తెలిపారు. కేంద్రం 25 వేల కోట్ల‌ను కేటాయించినా.. ఆయా స‌మ‌స్యకు పూర్తి స్థాయిలో ప‌రిష్కారం కాలేద‌న్నారు. ఏదైనా వ‌స్తువు కొంటే ఐఎస్ఐ ఉందా? లేదా? అని గ‌మ‌నిస్తాం.. కారు కొనేముందు ప్ర‌మాదం జ‌రుగుతుందేమోన‌ని ఆలోచించి ముంద‌స్తుగానే ఇన్సూరెన్స్ తీసుకుంటామ‌న్నారు. మ‌రి, కొన్నేళ్ల క‌ష్టార్జితంతో కొనే ఇంటి గురించి ఎంతో జాగ్ర‌త్త‌గా ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. క‌నీసం ఇప్ప‌టికైనా బిల్డ‌ర్లంతా క‌లిసిక‌ట్టుగా న్యాయ‌బ‌ద్ధంగా ప్రాజెక్టుల్ని చేప‌డ‌దామంటూ పిలుపునిచ్చారు.

బ్యాంకులు రుణాల్ని నిలిపివేయాలి..

తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు సీహెచ్ ప్ర‌భాక‌ర్ రావు మాట్లాడుతూ.. అధిక శాతం వ‌డ్డీ ఇస్తామ‌న్న నాలుగైదు చిట్ ఫండ్ కంపెనీలు బిచాణా ఎత్తివేశాయ‌న్నారు. చ‌ట్టం ప‌రిధిలోకి రాకుండా.. చ‌ట్టంలోని లొసుగుల్ని ఆస‌రాగా చేసుకుని యూడీఎస్‌, ప్రీలాంచ్ సేల్స్ చేసే డెవ‌ల‌ప‌ర్ల వ‌ద్ద ఫ్లాట్లు కొన‌డాన్ని నిలిపివేయాల‌న్నారు. ఇలాంటి వారంతా అమాయ‌కుల్ని మోసం చేస్తున్నార‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. ఇలాంటి మోస‌పూరిత డెవ‌ల‌ప‌ర్ల‌కు బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు రుణాల్ని మంజూరు చేయ‌డానికి నిలిపివేయాల‌ని సూచించారు. మ‌న సొమ్ముతో తీసుకుని భూమిని కొని, ఫ్లాట్లు క‌ట్టేవారని ఎట్టి ప‌రిస్థితిలో న‌మ్మ‌కూడ‌ద‌న్నారు. యూడీఎస్‌, ప్రీలాంచ్ సేల్స్ అనేవి క‌రోనా త‌ర‌హాలో క‌నిపించకుండా ప్ర‌జ‌ల్ని ప‌ట్టి పీడిస్తున్నాయ‌ని చెప్పారు. ఇలాంటి సంస్థ‌ల ప‌ట్ల ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

ఢిల్లీ, బెంగ‌ళూరు కాకూడ‌దంటే..

తెలంగాణ డెవ‌ల‌ప‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు జీవీ రావు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా అథారిటీల వ‌ద్ద ఇన్ఫ‌ర్మేష‌న్, గైడెన్స్ సెల్ ఏర్పాటు చేయాల‌ని కోరారు. గ‌త కొంత‌కాలం నుంచి హైద‌రాబాద్‌లో బిల్డ‌ర్లు ప‌ద్ధ‌తి ప్ర‌కారం నిర్మాణాల్ని చేప‌డుతున్నార‌ని కితాబునిచ్చారు. గ‌త నాలుగేళ్ల‌లో కేవ‌లం ఇద్ద‌రు బిల్డ‌ర్లు మాత్ర‌మే ఇబ్బందులు పెట్టార‌ని.. ఈ సంఖ్య రానున్న రోజుల్లో ఎక్కువ‌గా క‌నిపించే ప్ర‌మాదం ఉంద‌న్నారు. వాస్త‌వ ప‌రిస్థితుల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ఇలాంటి వారంతా అపార్టుమెంట్ల‌ను నిర్మిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. 111 జీవో ప్రాంతాల్లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా లేఅవుట్ల‌ను అభివృద్ధి చేస్తున్నార‌ని.. దీని వ‌ల్ల అభివృద్ధిలో స‌మాన‌త్వం క‌నిపించ‌ద‌న్నారు. ఫ‌లితంగా, హైద‌రాబాద్ అంద‌వికారంగా మారే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ప‌క్కా ప్ర‌ణాళిక‌లు లేక‌పోవ‌డం వ‌ల్లే ఢిల్లీ, బెంగ‌ళూరు ప్ర‌స్తుతం ఎంతో ఇబ్బంది ప‌డుతున్నాయ‌ని.. అలా హైద‌రాబాద్ కాకూడ‌దంటే ప్ర‌ణాళిక‌మైన రీతిలో అభివృద్ధి జ‌ర‌గాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో క్రెడాయ్ హైద‌రాబాద్, ట్రెడా ప్ర‌ధాన కార్య‌దర్శులు.. రాజ‌శేఖ‌ర్ రెడ్డి, బెజ‌వాడ సునీల్ చంద్రారెడ్డి, టీబీఎఫ్ విద్యాసాగ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

నిర్దిష్ఠ‌మైన ప్ర‌ణాళిక‌ల్లేవా?

తెలంగాణ నిర్మాణ సంఘాల‌న్నీ క‌లిసిక‌ట్టుగా యూడీఎస్‌, ప్రీలాంచ్ అమ్మ‌కాల మీద ప‌త్రికా స‌మావేశాన్ని నిర్వ‌హించ‌డం.. నిర్మాణ రంగంలో కొంద‌రు అనుస‌రిస్తున్న అక్ర‌మ విధానాల్ని అరిక‌ట్టాల‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. కాక‌పోతే, ఈ అక్ర‌మాల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై నిర్ధిష్ఠ‌మైన ప్ర‌ణాళిక‌ల్లేవ‌ని అర్థ‌మ‌వుతోంది. యూడీఎస్, ప్రీలాంచ్ సేల్స్ జ‌రుపుతున్న సంస్థ‌ల పేర్ల‌ను వెల్ల‌డించ‌డానికి సంఘాలు నిరాక‌రించాయి. మ‌రి, ఇప్పుడు పేర్ల‌నే వెల్ల‌డించ‌ని వారంతా.. రేపు ఏదైనా జ‌ర‌గ‌రాని మోసం వెలుగులోకి వ‌స్తే.. గ‌ట్టిగా కొనుగోలుదారుల‌కు మ‌ద్ధ‌తు తెలుపుతారా? అంటే సందేహాస్ప‌దంగానే క‌నిపిస్తోంది. క‌నీసం ఇప్ప‌టికైనా యూడీఎస్‌, ప్రీలాంచ్ సేల్స్ అమ్మ‌కాలు చేసేవారి జాబితాను నిర్మాణ సంఘాల‌న్నీ క‌లిసిక‌ట్టుగా విడుద‌ల చేయాలి. అప్పుడే, వీరి పోరాటం ఫ‌లిస్తుంది. లేక‌పోతే, గాల్లో కాల్పులు జ‌రిపిన‌ట్లే. దీని వ‌ల్ల ఎవ‌రికీ ఎలాంటి ఉప‌యోగం ఉండ‌దు.

This website uses cookies.