ఏడాది కాలంలో నిర్మాణ వ్యయం 10 శాతం నుంచి 12 శాతం మేర పెరిగిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ సేవల కంపెనీ కొల్లియర్స్ పేర్కొంది. నిర్మాణ రంగ సామగ్రి సరఫరాల్లో అవాంతరాల వల్ల ఉత్పాదక వ్యయం పెరిగి వాటి ధరలు పెరిగాయని.. ఇది అంతిమంగా నిర్మాణ వ్యయంపై ప్రభావం చూపించిందని వివరించింది. సిమెంట్, స్టీల్ వంటివాటి ధరలు ఏడాదికి 20 శాతం మేర పెరిగాయని తెలిపింది.
నిజానికి కోవిడ్ తర్వాత రియల్ రంగం గాడిన పడుతున్న తరుణంలోనే ధరల పెరుగుదల ప్రారంభమైంది. డెవలపర్లకు ఈ విషయం తెలిసినా అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరల సెగ వారికి బాగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ ధరల వ్యూహంలో ఎలాంటి మార్పులు చేయాలనేదానిపై వారు కసరత్తు చేస్తున్నారు’ అని నివేదిక పేర్కొంది. గత కొన్నేళ్లుగా డెవలపర్లు చాలా తక్కువ మార్జిన్ తోనే నెట్టుకొస్తున్నారని, కానీ ప్రస్తుతం ధరలు పెరిగిన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొల్లియర్స్ ఇండియా సీఈఓ రమేష్ నాయర్ వివరించారు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ వ్యయం మరో 8 శాతం నుంచి 9 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అందుబాటు ధరల గృహాలతోపాటు మిడ్ సెగ్మెంట్ ప్రాజెక్టులు ఇప్పటికే చాలా తక్కువ మార్జిన్ తో నడుస్తున్నాయని.. ఈ నేపథ్యంలో పెరిగిన నిర్మాణ వ్యయాన్ని కొనుగోలుదారులపై మోపడం తప్ప మరో మార్గం లేక డెవలపర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కొల్లియర్స్ ఇండియా చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ అర్జీనియో అంటావో సూచించారు.
This website uses cookies.