శబ్ద, వాయు, దుమ్ము కాలుష్యాన్ని తగ్గించేందుకు మార్గదర్శకాల ఏర్పాటు
ఇప్పటికైనా పురపాలక శాఖ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించాలి
ముంబై, చెన్నై వంటి నగరాలకు గల భౌగోళిక అడ్డంకులు హైదరాబాద్ నగరానికి లేనే లేవు. అందుకే, నగరం నాలుగు వైపులా విస్తరించడానికి పూర్తి అవకాశాలున్నాయి. మెట్రో, ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్ల కారణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులువుగా రాకపోకల్ని సాగించేందుకు వీలు ఏర్పడింది. మన వద్ద స్థలం కొరత లేదు కాబట్టి, హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల్ని పెద్దగా కట్టక్కర్లేదని నిపుణులు అభిప్రాయం. అయినప్పటికీ, మన డెవలపర్లు నగరంలోనే.. జనావాసాలున్న ప్రాంతాల్లోనే.. బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యల్ని కడుతున్నారు.
ఎక్కడ స్థలం దొరికితే చాలు.. అక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగించి మరీ అపార్టుమెంట్లను కట్టేస్తున్నారు. ఫలితంగా, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వీరి నిర్వాకం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. కనీసం, ఇప్పటికైనా ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది.
ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో స్థానిక సంస్థలు అపార్టుమెంట్లకు అనుమతిని మంజూరు చేసేటప్పుడు.. పని వేళల గురించి ముందే డెవలపర్లకు స్పష్టంగా పేర్కొనాలి. ఉదయం నుంచి రాత్రివరకూ పని చేసుకోవాలని సవివరంగా చెప్పాలి. అంతేకాదు, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారికి ఎలాంటి సమస్యలు రాకుండా నిర్మాణాల్ని చేపట్టాలని తెలియజేయాలి.
స్థానిక సంస్థ నుంచి అనుమతి రాగానే చాలు.. డెవలపర్లు ముందుగా సెల్లార్లను తవ్వుతుంటారు. వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయాలనే తొందరలో రాత్రింబవళ్లు పని చేస్తూ.. స్థానికులకు తీవ్ర ఇబ్బందుల్ని కలిగిస్తారు. ప్రజలు 100కు ఫిర్యాదు చేస్తే.. నిర్మాణాలకు అనుమతినిచ్చేది జీహెచ్ఎంసీ కాబట్టి, వారికి ఫిర్యాదు చేయమని ఉచిత సలహా పారేస్తుంటారు. అంతేతప్ప, రాత్రివేళ పని చేసేవారిని తాము నిలువరించలేమని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి, స్థానిక సంస్థలు ఈ విషయంలో డెవలపర్లకు స్పష్టతనివ్వాలి. సెల్లార్లను తవ్వే పనిని ఉదయం పూట మాత్రమే చేసుకోవాలనే తెలియజేయాలి.
నివాస ప్రాంతాల్లో కొత్తగా కట్టే అపార్టుమెంట్ల వల్ల.. వాటి చుట్టుపక్కల నివసించేవారికి వాయు, శబ్ద కాలుష్యాలు నిత్యకృత్యంగా మారతాయి. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఆలోచించాలి. ఇందుకు సంబంధించి సరికొత్త విధివిధానాల్ని ఏర్పాటు చేయాలి. ప్రజలు ఎదుర్కొనే వాస్తవిక సమస్యల గురించి ఆలోచించి.. అందుకు తగ్గ పరిష్కార మార్గాల్ని అధికారులే సూచించాలి. శబ్ద, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు డెవలపర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని మార్గదర్శకాల్ని సిద్ధం చేయాలి. లేకపోతే, ఈ సమస్య నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.