వర్షం పడితే తప్ప.. ప్రభుత్వానికి వరద నీటి కాల్వల గురించి ఆలోచన రాదు. గత వారం రోజుల్నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డ్రైనేజీలన్నీ నిండుకుపోయాయి. రోడ్లన్నీ గోదారిని తలపించాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రహదారులనూ మూసివేశారు. ఫలితంగా, వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. దీంతో నగర ప్రజలెంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాగైతే, హైదరాబాద్ అంతర్జాతీయ నగరాలతో ఎలా పోటీ పడుతుంది? ఇప్పటికైనా, నగరంలో వరద నీటి కాల్వల్ని అభివృద్ధి చేయాలని నగరవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత.. పాలకులు హైదరాబాద్‌లో స్థలాల్ని ధరల్ని కృత్రిమంగా పెంచడంపై చూపెట్టిన శ్రద్ధ మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడంపై పెట్టలేదని ప్రజలు అంటున్నారు. విదేశీ నగరాలతో పోటీ పడాలనే ఆలోచనలుండగానే సరిపోదు. దానికి అనుగుణంగా బడ్జెట్‌లో నిధుల్ని కేటాయించాలి. జీవోలను విడుదల చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఎప్పుడో నిజం నవాబు అభివృద్ధి చేసిన డ్రైనేజీ వ్యవస్థ మీద నేటికీ మనం ఆధారపడుతున్నాం.
నిన్నటి శివారు ప్రాంతాలైనా శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కొంపల్లి, హయత్ నగర్, శంషాబాద్, అత్తాపూర్, గచ్చిబౌలి, పటాన్‌చెరు వంటి ప్రాంతాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయలేదు. కొత్త నిర్మాణాల్నుంచి వసూలు చేసే ఇంపాక్టు ఫీజును ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడంపై ఖర్చు పెట్టడం ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, వరదనీటి కాల్వల్ని అభివృద్ధి చేయాలన్న దూరదృష్టి ప్రభుత్వానికి లోపించిందని ప్రజలు విమర్శిస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం నాలాల్ని ఆక్రమించుకుని నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఎక్కడికక్కడ అక్రమ కట్టడాల్ని కూల్చివేసింది. కానీ, అదేంటో కానీ గత కొంతకాలంగా ఈ స్పెషల్ నిర్వహించడాన్ని నిలిపివేసింది. దీంతో, ఎక్కడపడితే అక్కడ నాలాలు కబ్జాకు గురయ్యాయి. కనీసం ఇప్పటికైనా పురపాలక శాఖ అధికారులు నాలాలపై ఉన్న కబ్జాలపై కన్నెర్ర చేయాలి. వరద నీటి కాల్వల్ని అభివృద్ధి చేయాలి.
This website uses cookies.