- రియాల్టీలో పెరుగుతున్న
మహిళల పెట్టుబడులు..
రియల్ ఎస్టేట్ లో సాధారణంగా పురుషులే ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పటివరకు కొనసాగిన ఈ ట్రెండ్ మారుతోంది. మహిళలు కూడా రియల్ రంగం వైపు చూస్తున్నారు. తమ సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని ప్రాపర్టీ కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడుల కంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకునే అతివల సంఖ్య పెరుగుతోందని తాజాగా విడుదలైన ఓ నివేదికలో వెల్లడైంది. అనరాక్ నిర్వహించిన కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వేలో ఈ విషయం నిర్ధారణ అయింది.
మహిళల దృష్టిలో బంగారం కంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడే బాగుంటుందని తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో కనీసం 65 శాతం మంది మహిళలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి వైపు మొగ్గు చూపగా.. 20 శాతం మంది స్టాక్ మార్కెట్ ను ఎంచుకున్నారు. కేవలం 8 శాతం మంది మాత్రమే బంగారం వైపు మొగ్గు చూపించారు. మరో 7 శాతం మంది ఫిక్స్ డ్ డిపాజిట్లకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక రూ. 45 లక్షల నుంచి 90 లక్షల లోపు ధర కలిగిన గృహాల కొనుగోలుకు 36 శాతం మంది ఆసక్తి చూపించగా.. రూ. 90 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర కలిగిన ఇళ్ల వైపు 27 శాతం మొగ్గు చూపించారు. రూ. కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఇళ్ల కొనుగోలుకు 20 శాతం మంది ఓటేశారు.