తెలంగాణ ఏర్పడిన కొత్తలో.. అప్పటి క్రెడాయ్ హైదరాబాద్ నాయకత్వం.. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి.. హైటెక్స్‌లో నిర్వహించిన ప్రాపర్టీ షోకు ఆహ్వానించింది. నిర్మాణ రంగంలో సరికొత్త విశ్వాసం నెలకొల్పేందుకు ప్రయత్నించింది. కానీ, 2024 వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. 2024 ఆగస్టు ప్రాపర్టీ షోకు సీఎం రేవంత్‌రెడ్డిని రప్పించడంలో విఫలమైంది. దీంతో, క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో పాల్గొన్న నిర్మాణ సంస్థలూ నిరాశ చెందాయి. పైగా, మొదటి రోజు ప్రాపర్టీ షోలో సందర్శకుల సంఖ్యా పెద్దగా లేదు. మరి, మిగతా రెండు రోజులూ సందర్శకులు పెరుగుతారా? లేదా? అనేది చూడాలి.
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని ఊదరగొట్టింది. కొన్ని పత్రికలైతే సీఎం ప్రారంభోత్సవంలో పాల్గొంటారని కూడా వార్తల్ని ప్రచురితం చేశాయి. కాకపోతే, ఈ సంఘంపై ముందు నుంచి సీఎం కొంత గుర్రుగా ఉన్నారని సమాచారం. అదే విషయం గురువారం రాత్రి మాదాపూర్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలోనూ తేటతెల్లమైంది. బిల్డర్లు వ్యాపారం చేసుకోవాలని.. రాజకీయాలు చేయకూడదని సీఎం స్పష్టం చేశారు. అలా చేస్తే తాము కూడా అదేవిధంగా ప్రవర్తించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.
ఒకప్పుడు ప్రాపర్టీ షో తేదీలను నిర్వహించాల్సి వస్తే.. క్రెడాయ్ హైదరాబాద్ ప్రతి అంశాన్ని పక్కాగా విశ్లేషించాకే తేదీలను ప్రకటించేది. అమాత్యులెవరెవరు అందుబాటులో ఉంటారో పక్కాగా కనుక్కునేవారు. టెక్నికల్ సెషన్స్ పై కూడా ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసేవారు. కానీ, ఈసారి ప్రాపర్టీ షోను హడావిడిగా నిర్వహిస్తున్నారని అర్థమవుతోంది. నగరంలో ప్రీలాంచ్ మోసాలు పెరగడం.. కొందరు రియల్టర్లు బయ్యర్లను దారుణంగా మోసం చేసిన నేపథ్యంలో.. క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్‌బిలిటీ అంటూ ప్రచారాన్ని నిర్వహించడం పట్ల సర్వత్రా వ్యతిరేకత ఏర్పడింది. అసలు క్రెడాయ్ హైదరాబాద్‌కి క్రెడిబిలిటీయే లేదనే స్థాయికి హోమ్ బయ్యర్లు చేరుకున్నారు.
ఏదీఏమైనా, మార్కెట్ ప్రతికూలంగా ఉన్నప్పుడు.. పాజిటివిటీని డెవలప్ చేయడానికి క్రెడాయ్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ కమిటీ పెద్దగా ప్రయత్నించలేదు. కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించి.. మార్కెట్ మెరుగ్గా ఉందని చెప్పలేదు. కాకపోతే, ప్రాపర్టీ షోను నిర్వహించాల్సి వచ్చినప్పుడు మాత్రమే ప్రెస్ మీట్ ను నిర్వహించిందనే అపఖ్యాతిని మూటగట్టుకుంది. పైగా, ప్రీలాంచుల్ని నిరోధించడంలోనూ పూర్తిగా విఫలమైంది. మొత్తానికి, ప్రస్తుత క్రెడాయ్ హైదరాబాద్ కమిటీ కారణంగా.. ఈ సంఘం కొన్నేళ్లుగా సంపాదించుకున్న క్రెడిబిలిటీని కోల్పోతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
This website uses cookies.