రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ లో సానుకూల సెంటిమెంట్ కొనసాగుతోంది. ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇళ్ల ధరలు వార్షిక ప్రాతిపదికన 10 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లోనూ ఇళ్ల ధరల్లో పెరుగుదల నమోదైంది.
బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, పుణెల్లో రెండంకెల పెరుగుదల కనిపించగా.. మిగిలిన నగరాల్లో 2 నుంచి 7 శాతం మేర పెరుగుదల నమోదైంది. అలాగే దేశంలోని చాలా పట్టణాల్లో ఇళ్ల ధరలు పెరిగాయి. అయితే, రియల్ ఎస్టేట్ మార్కెట్ అటు కొనుగోలుదారులకు, ఇటు డెవలపర్లకు సానుకూలంగానే ఉన్నప్పటికీ.. అమ్ముడుపోని ఇళ్ల ఇన్వెంటరీ వార్షిక ప్రాతిపదికన 3 శాతం పెరగడం గమనార్హం. పుణెలో మాత్రం ఈ జాబితాలో 10 శాతం తగ్గుదల నమోదైంది. ఢిల్లీ, అహ్మదాబాద్ లలో కూడా అమ్ముడుపోని ఇళ్ల ఇన్వెంటరీ వార్షిక ప్రాతిపదికన 8 శాతం తగ్గింది. మొత్తమ్మీద 2024 క్యూ1 నాటికి దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 10 లక్షల యూనిట్లకు చేరుకుంది.
ఇందులో ఒక్క ముంబై వాటానే 40 శాతం ఉంది. అయితే, త్రైమాసికాల వారీగా చూస్తే.. ఇళ్ల అమ్మకాల్లో డిమాండ్ కారణంగా అమ్ముడుపోని ఇళ్ల ఇన్వెంటరీలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ఇక హైదరాబాద్, బెంగళూరుల్లో వార్షిక ప్రాతిపదికన అమ్ముడుపోని ఇళ్ల ఇన్వెంటరీ జాబితా పెరిగినప్పటికీ.. త్రైమాసిక ప్రాతిపదికన స్వల్పంగా తగ్గింది. ఈ నేపథ్యంలో డెవలపర్లు ఆ ఇన్వెంటరీకి అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘ఇళ్ల ధరల్లో పెరుగుదల హౌసింగ్ డిమాండ్ పై నేరుగా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ప్రీమియం, లగ్జరీ హౌసింగ్ పై ఇది ఎక్కువగా ఉంటుంది’ అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు.
This website uses cookies.