ఇందులో అమ్మకం లేనందున పన్ను విధింపు సమంజసం కాదంటున్న డెవలపర్లు
సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు జారీ
రియల్ ఎస్టేట్ డెవలపర్లు, భూమి యజమానుల మధ్య అభివృద్ధి హక్కుల బదిలీ కోసం చేసుకునే సంయుక్త అభివృద్ది ఒప్పందాల(జేడీఏ)పై 18 శాతం జీఎస్టీ విధించడం సరికాదని డెవలపర్లు వాదిస్తున్నారు. జేడీఏలలో ఎలాంటి భూమి అమ్మకం జరగదని.. అందువల్ల ఈ బదిలీలపై పన్ను విధించడం తగదని పేర్కొంటున్నారు. జేడీఏలపై పన్ను విధించొచ్చంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ డెవలపర్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసి, విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. అయితే, తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వనందున.. జేడీఏలపై డెవలపర్లు జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది.
నిజానికి జేడీఏ అనేది భూ యజమాని, రియల్ ఎస్టట్ డెవలపర్ మధ్య ఓ ప్రాజెక్టులో సంయుక్తంగా పనిచేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో భూ యజమాని భూమిని ఇస్తాడు. డెవలపర్ భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటివి చూస్తాడు. ఈ నేపథ్యంలో భూమిని మూడో పక్షానికి విక్రయించినప్పుడు మాత్రమే జీఎస్టీ విధించాలని.. జేడీఏలలో అమ్మకం అనే ప్రసక్తే లేదు కాబట్టి.. పన్ను విధించకూడదని టాటా రియల్టీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ దత్ పేర్కొన్నారు. జేడీఏలపై జీఎస్టీ విధించడం వల్ల రియల్ ఎస్టేట్ అభివృద్ధి సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. దీనివల్ల డెవలపర్లు ఆ ప్రాపర్టీ ధరను పెంచాల్సి వస్తుందని.. ఫలితంగా కొనుగోలుదారులపై భారం పడుతుందన్నారు. జేడీఏలలో ఎలాంటి సేవలు లేవనందున వీటిపై జీఎస్టీ విధించడం సమంజసం కాదని పలువురు బిల్డర్లు పేర్కొంటున్నారు. పైగా జేడీఏలపై స్టాంపు డ్యూటీ చెల్లిస్తందనున జీఎస్టీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు.