రియల్ ఎస్టేట్ రంగం చాలా గొప్పగా, గౌరవంగా ఉండే పరిస్థితిలోకి రావాలని క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ గుమ్మి రాంరెడ్డి పేర్కొన్నారు. నేను బిల్డర్ అని గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండాలన్నారు. కొనుగోలుదారులను మోసం చేసేవారిని కఠినంగా శిక్షించినప్పుడే రియల్ రంగం గౌరవంగా ఉంటుందని స్పష్టంచేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం, ఏపీలో కూటమి సర్కారు ఏర్పాటు కావడం వంటి అంశాలు రియల్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అఫర్డబులిటీ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది వంటి అనేక అంశాలపై ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలివీ..
రియల్ ఎస్టేట్ గురు: మన దేశంలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది. మరి రియల్టీ రంగం పరిస్థితి ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు?
గుమ్మి రాంరెడ్డి: ఎన్డీఏ వల్ల పెద్ద తేడా ఏమీ ఉండదు. గతంలో ఎన్డీయే ఉంది కాబట్టి.. అదే కొనసాగుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ పై పెద్ద ప్రభావం ఉండదు. సానుకూల వాతావరణమే కొనసాగుతుంది. ఎలాంటి ప్రతికూలతా ఉండదు. అయితే మెజార్టీ తగ్గడం వల్ల సెన్సెక్స్ తగ్గింది. అయితే ఇవన్నీ తాత్కాలికమే.
ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం వల్ల ఇన్వెస్టర్స్ అటు వెళ్లిపోతారనే టాక్ వినిపిస్తుంది. ఇది ఎంత వరకు నిజం అంటారు?
గత ఐదేళ్ల నుంచి ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం బాలేదు. కొన్ని రాజకీయ కారణాలరీత్యా అలా జరిగింది. రాజధాని ఒక దగ్గర అనుకున్నారు. కానీ కాలేదు. రాజధాని అమరావతి అని ప్రకటించిన తర్వాత చాలామంది హైదరాబాద్ నుంచి అక్కడకు వెళ్లి పెట్టుబడులు పెట్టారు. భూముల ధరలు బాగా పెరిగాయి. కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కొన్ని లాంచ్ అయ్యాయి. కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. ధరలు పడిపోవడంతో భూములు కొనుక్కున్నవారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు మళ్లీ రావడంతో డెవలప్ మెంట్ ఉంటుంది. అమరావతి అనేది కచ్చితంగా రాజధాని అవుతుంది. దీనిపై ఇప్పటికే ప్లానింగ్ మొదలైంది కాబట్టి అది కొనసాగుతుంది. దీంతో పెట్టుబడిదారులు మళ్లీ అటు వైపు చూస్తారు. కొత్త ఇన్వెస్టర్లు కూడా అక్కడకు వెళ్లే అవకాశం ఉంది.
హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇది పురాతన చరిత్ర కలిగిన నగరం. ఇక్కడ వాతావరణం, మౌలిక వసతుల వంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. హైదరాబాద్ వదిలి ఎవరూ ఎక్కడకు వెళ్లరు. అయితే, ప్రభావం మాత్రం ఉంటుంది. ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. అమరావతిలో ఎకరం రూ.2 కోట్లు పెట్టి కొంటే ఏడాదికి రూ.3 కోట్లో, రూ.4 కోట్లో అవుతుంది. ఎందుకంటే అది గ్రోత్ పార్ట్ లో ఉంది. అందువల్ల కొంతమంది ఇన్వెస్టర్లు అటువైపు కచ్చితంగా వెళతారు. అయితే, దానివల్ల ఇక్కడేదో జరిగిపోదు. కాకుంటే కొంతకాలం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ వల్ల కొంచెం ప్రభావం ఉంటుంది. ఇక్కడున్న మౌలిక వసతులు, ఇతర అంశాల వల్ల ప్రజలు హైదరాబాద్ లో నివసించడానికి ఇష్టపడతారు. అయితే, అమరావతిలో పెట్టుబడులు పెట్టేవారు అక్కడ ఉండరు. కానీ ఇన్వెస్టర్లు అక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల ఏపీలో కూడా గ్రోత్ ఉంటుంది.
హైదరాబాద్ అంటేనే ఆఫర్డబుల్ సిటీ.. అందుకే అనేక ఐటీ కంపెనీలొచ్చాయి. ఇప్పుడేమో ముంబై తర్వాత కాస్ట్ లీ సిటీ అయ్యిందా? మరి, రియల్ ఎస్టేట్ అఫర్డబుల్ లేకపోతే, ప్రపంచ ఐటీ సంస్థలు హైదరాబాద్ వైపు ఎందుకు చూస్తాయి?
మూడు, నాలుగేళ్ల కింద బాగా ఉండేది. కానీ ఇప్పుడు అంత అఫర్డబుల్ అని చెప్పలేం. ఎందుకంటే మన దగ్గర కూడా ధరలు బాగా పెరిగాయి. భూమి ధర విపరీతంగా పెరగడం, నిర్మాణ వ్యయం కూడా పెరగడం వల్ల అఫర్డబులిటీ తగ్గుతోంది. ఒకప్పుడు రెంటల్ వాల్యూ హైదరాబాద్ లో చీపెస్ట్ గా ఉండేది. కానీ ఇప్పుడు బాగా పెరిగింది. అయితే, హైదరాబాద్ ప్రత్యేకత ఏంటంటే.. మల్టీ లాంగ్వేజెస్. దేశంలోని ఏ వ్యక్తి అయినా ఇక్కడకు వచ్చి సెటిల్ అవ్వొచ్చు. ఇక్కడ వాతావరణం బాగుంటుంది. సౌకర్యాలున్నాయి. అందువల్ల ప్రజలు హైదరాబాద్ వైపు చూస్తారు. అఫర్డబులిటీ తగ్గినా.. త్వరలోనే ఇందులో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
భౌగోళికపరంగా ఎలాంటి అడ్డంకుల్లేని హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలెందుకు? మనకు నదులు కానీ పర్వతాలు వంటి అడ్డంకుల్లేమీ లేవు కదా.. అలాంటప్పుడు ఈ స్కై స్క్రేపర్స్ వల్ల ఫ్లాట్ల రేట్లు పెరిగాయని అంటారా?
ఇది ముంబై కాదు. మనకు సముద్రం కూడా ఏమీ లేదు. అయితే, కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లోనే డెవలప్ మెంట్ జరిగింది. హైటెక్ సిటీ, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలపైనే ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. దీంతో ఆ ప్రాంతాల్లో భూమి ధరలు విపరీతంగా పెరిగాయి. రూ.70 కోట్లకు ఎకరం కొంటే.. మనం ఎంత ఏరియాలో నిర్మాణాలు చేస్తే అఫర్టబుల్ అవుతుంది? అదే పది అంతస్తులు కడితే చదరపు అడుగు రూ.20 వేల నుంచి రూ.30వేలకు అమ్మాలి. అందువల్లే 30 అంతస్తులు, 40 అంతస్తులు అనేది సాధారణమైపోయింది. దీనివల్ల ల్యాండ్ కాంపొనెట్, నిర్మాణ వ్యయం కలిపి చదరపు అడుగుకు రూ.9 వేలు, రూ.10వేలు ధర పలుకుతోంది. రింగు రోడ్డు చుట్టూ గ్రోత్ కారిడార్ ఉంది. ప్రతి 500 మీటర్లకు గ్రిడ్ రోడ్ ఉంటుంది. అలాంటి గ్రిడ్ రోడ్లు ఏర్పాటు చేస్తే.. డెవలప్ మెంట్ అటు షిప్ట్ అవుతుంది. కొంగరకలాన్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో బోలెడంత భూమి ఉంది. కానీ రోడ్లు లేవు. ప్రభుత్వం గ్రిడ్ రోడ్లపై ఫోకస్ చేస్తే.. ప్రయాణ సమయం చాలా ఆదా అవుతుంది. ఎక్కడికైనా చాలా త్వరగా వెళ్లొచ్చు. అందువల్ల ప్రభుత్వం రింగు రోడ్డు చుట్టూ అభివృద్ధి, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి. అలా చేయడం వల్ల ఇక్కడ వసతులపై భారం పడదు. ప్రస్తుతం ఇక్కడే 40 అంతస్తులు, 50 అంతస్తులు భవనాలు వెల్లువలా వచ్చేస్తే.. జనసాంద్రత పెరిగిపోయి చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల నగరానికి నలువైపులా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
మీరు క్రెడాయ్ నేషనల్ కు సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. మీ రోల్ అండ్ రెస్పాన్స్ బిలిటీస్ గురించి చెబుతారా?
క్రెడాయ్ లో దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 240 చాప్టర్లు ఉన్నాయి. తెలంగాణలో 15 చాప్టర్లు, ఆంధ్రాలో 20 చాప్టర్లు ఉన్నాయి. నేషనల్ సెక్రటరీగా వీటన్నింటినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. రకరకాల ఈవెంట్స్, సమావేశాలు, పోస్టింగుల వంటివి చూసుకోవాల్సి ఉంటుంది. వివిధ రకాల సమస్యలపై అధ్యక్షుడికి మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. ఆఫీస్ బేరర్స్ కి సపోర్టు చేయాలి.. సెక్రటేరియట్ టీమ్ ను మోటివేట్ చేయడం.. వారితో పని చేయించడం వంటి రకరకాల పనులు ఉంటాయి.
క్రెడాయ్ విస్తరణలో మీరు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు?. సెక్రటరీగా మీరు స్పెషల్‌గా ఫోకస్ చేసే సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా?
క్రెడాయ్ నేషనల్, సిటీ చాప్టర్ల మధ్య అనుసంధానంగా ఉండాలి. ఇది చాలా కీలకం. ఎక్కడా ఎలాంటి గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ సరిగా ఉంటే అందరూ చాలా హ్యాపీగా పని చేస్తారు.
చివరగా, భారత రియల్ రంగం ఇంకా వేగంగా అభవృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాల్ని తీసుకోవాలని అంటారు? మీరు కేంద్రం నుంచి ఎలాంటి సపోర్టు కావాలని కోరుకుంటున్నారు?
రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం తప్పకుండా సహకరించాలి. ఎందుకంటే అఫర్డబులిటీ అనేది పోతోంది. వడ్డీ రేట్లు పెరిగాయి. దీనివల్ల సామాన్యులకు భారంగా మారింది. అందుబాటు ధరల ఇళ్లకు రూ.45 లక్షల పరిమితి విధించారు. ప్రస్తుతం రూ.45 లక్షలకు ఇల్లు ఎలా వస్తుంది? మన సిటీ వరకు ఓకే.. అదే ముంబై వంటి నగరంలో అది సాధ్యమవుతుందా? అందువల్ల దీనిని కొంచెం పెంచమని కోరుతున్నాం. అలాగే ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలి. గతంలో క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ఇచ్చేవారు. దీని కింద రూ.2.5 లక్షల వరకు ఆదా అయ్యేది. దానిని నిలిపివేశారు.
రియల్ ఎస్టేట్ అనగానే కొంచెం నెగిటివిటీ ఉంటుంది. ఇక్కడ రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టినా.. దీనిని ఇండస్ట్రీ అనరు. అదే ఒక వ్యక్తి రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టి ఓ ఇండస్ట్రీ పెడితే.. అతడు ఇండస్ట్రియలిస్ట్ అయిపోతాడు. రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు. పన్ను రాయితీలు సహా ఎన్నో ప్రోత్సాహకాలు ఉంటాయి. కానీ రియల్ రంగంలో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ కొంతవరకు మా పాత్ర కూడా ఉంది. కొంతమంది డెవలపర్లు 100 శాతం విశ్వసనీయత లేకుండా రావడం, కొందరు బిల్డర్లు అరెస్టు కావడం వంటి వాటి వల్ల పరిశ్రమకు చెడ్డ పేరు వస్తోంది. రెరా వంటి సంస్థలు ఇంకా కొరడా ఝళిపించాల్సిన అవసరం ఉంది. కొనుగోలుదారులను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించే పరిస్థితి వస్తే తప్పనిసరిగా మార్పు వస్తుంది. నేను బిల్డర్ అని గొప్పగా చెప్పుకునే పరిస్థితి రావాలి. రియల్ ఎస్టేట్ అనేది వ్యవసాయం తర్వాత ఎంతో మందికి ఉపాధి కల్పించే కీలక రంగం. రియల్ రంగం ద్వారానే జీడీపీకి గ్రోత్ ఉంది. దాదాపు 250 ఇండస్ల్రీలు ఆధారపడి ఉన్నాయి. అలాంటి రియల్ ఎస్టేట్ రంగం చాలా గౌరవంగా, గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా.
This website uses cookies.