రిటైర్మెంట్ తర్వాత కూడా ఆదాయం పొందడానికి ఉన్న మార్గాల్లో అద్దె ఆదాయం ఒకటి. ఇందుకోసం ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటారు. ప్రాపర్టీని కొని అద్దెకు ఇస్తే ఆదాయం బాగానే వస్తుంది. ద్రవ్యోల్బణంతోపాటు అద్దె కూడా పెరుగుతుంది. అయితే, ఇందులో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అద్దె ఆదాయం కోసం అవసరమైన ప్రాపర్టీలకు పెద్ద మొత్తంలో పెట్టుబడలు పెట్టాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ మెంట్ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలంటే అధిక పెట్టుబడి పెట్టక తప్పదు. ఎక్కువ మొత్తంలో డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
తగినంత టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా తీసుకోవాలి. ఆస్తి కలిగి ఉన్నందుకు చార్జీలు చెల్లించాలి. డౌన్ పేమెంట్ తోపాటు ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ ప్రాపర్టీలను ఎలా కొనుగోలు చేయాలి? ఎలా అద్దెకు ఇవ్వాలి? ఎలా మెయింటనెన్స్ చేయాలి అనేవి తెలుసుకోవాలి. ఇందుకు బ్రోకర్ల సహాయం అవసరమవుతుంది. ఇందుకోసం బ్రోకరేజీ ఖర్చు కూడా ఉంటాయి. మరోవైపు వడ్డీ రేట్లు 9 శాతానికి మించడంతో ఆస్తి కొనుగోలు ఖర్చు కూడా పెరిగింది.
ప్రాపర్టీ కొనుగోలు చేసిన తర్వాత మంచి అద్దెదారులను చూడాల్సి ఉంటుంది. అద్దెదారులను కనుక్కోవడం, ఆస్తిని నిర్వహించడం వంటివాటికి ఖర్చు తప్పదు. అద్దె చెల్లించకపోయినా, ఖాళీ చేయకుండా ఇబ్బందిపెడుతున్న అద్దెదారులతో సరైన విధంగా వ్యవహరించడానికి మరికొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ తలనొప్పులన్నీ మనకెందుకులే అనుకుంటే ఓ రియల్ ఎస్టేట్ మేనేజర్ ను చూసుకోవాలి. అయితే, మంచి ప్రాపర్టీ మేనేజర్ దొరకడం కూడా అంత సులభం కాదు. అలాగే ప్రాపర్టీ కొనుగోలు ప్రదేశం కూడా చాలా ముఖ్యం.
ఎక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేస్తే ఆదాయపరంగా మంచిదో ముందుగా అన్ని అంశాలూ బేరీజు వేసుకోవాలి. ఇక పెట్టుబడి ఆస్తులను సొంతం చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ పన్ను ప్రయోజనాలు లేవు. అద్దె ఆదాయంపై పన్ను విధిస్తారు. వాస్తవానికి దాదాపు రియల్ ఎస్టేట్ బ్రోకర్టు, బిల్డర్లు రియల్ ఎస్టేట్ లో డబ్బులు పోయే పరిస్థితి ఉండదని చెబుతారు. కానీ ఈ రంగంలో కూడా చాలా మంది తమ పెట్టుబడులు పొగొట్టుకున్నవారూ ఉన్నారు.
అద్దె ఆదాయం కోసం కొనుగోలు చేసిన ప్రాపర్టీ విషయంలో మీ వయస్సు పెరిగే కొద్దీ దాని నిర్వహణ చూసుకోవడం మీకు సాధ్యమవుతుందా? అద్దె వసూలు చేయడానికి వెళ్లడం, కరెంటు బిల్లు చెల్లించడం, సొసైటీ చార్జీలు చెల్లించడం, భవనం నిర్వహణ చూసుకోవడం కుదురుతుందా? వయసు పైబడిన తర్వాత ఇది సాధ్యం కాదు. అంటే పదవీ విరమణ తర్వాత ఆదాయం సంపాదించడానికి రియల్ ఎస్టేట్ ఓ సాధనంగా భావించడం అందరికీ కుదరదు.
ఉదాహరణకు మీకు రూ.కోటి విలువైన ప్రాపర్టీ ఉంటే దానిని విక్రయించి బ్యాంకులో డిపాజిట్ చేస్తే వడ్డీ కింద ఏడాదికి దాదాపు రూ.10 లక్షలు వస్తుంది. అదే అద్దె కింద అయితే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రావొచ్చు. అందువల్ల 75 ఏళ్లు పైబడిన వ్యక్తికి అద్దె ఆదాయం అంత సెట్ కాదు. పన్ను విధించతగ్గ ఇతర ఆదాయాలు కలిగి ఉన్న 55 ఏళ్ల లోపు వ్యక్తులకు ఇది సూట్ అవుతుంది.
This website uses cookies.