క్రెడాయ్ 4వ ఎడిషన్ న్యూ ఇండియా సదస్సు-2022ని విశాఖపట్నంలో ఈనెల 29, 30వ తేదీల్లో నిర్వహిస్తున్నట్టు క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి తెలిపారు. వృద్ధి సవాళ్లు, టైర్-2, 3, 4 నగరాల్లో అభివృద్ధిపై సదస్సులో చర్చిస్తామని పేర్కొన్నారు. నాన్ మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి, రోడ్ మ్యాప్ తదితర అంశాలు చర్చించేందుకే క్రెడాయ్ 4వ ఎడిషన్ నిర్వహిస్తున్నట్టు వివరించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అభివృద్ధి, ఆకర్షణీయమైన అవకాశాలపరంగా మెట్రో నగరాలు బలమైన వృద్ధిని కలిగి ఉన్నాయి. అలాగే వర్క్ ఫ్రం హోం విధానం కారణంగా టైర్-2, 3 నగరాల్లో కూడా అభివృద్ధి పెరుగుదల కనిపిస్తోంది. టైర్-2, 3 నగరాల్లో సరసమైన ధరలకే పెద్ద ఇళ్లు లభిస్తాయని, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఆయా నగరాల్లో భూమి సులభంగా దొరకడం, ధరలు సరసమైనవి కావడం వల్ల అక్కడ రియల్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. చిన్న నగరాల నుంచి రియల్టర్లు పోషించే పాత్ర ఇటు పరిశ్రమకు, అటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైనదనే అంశాన్ని క్రెడాయ్ గుర్తించి అర్థం చేసుకుంది’ అని రాంరెడ్డి పేర్కొన్నారు.
కోవిడ్ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్ల వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని.. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నిర్మాణాలకు వినియోగించే సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వివరించారు. వీటిని పరిష్కరించడానికి వినూత్న ఆలోచనలు అవసరమని, ఈ నేపథ్యంలో నిపుణులైన వ్యక్తులు ఈ సదస్సులో ప్రసంగిస్తారని వెల్లడించారు. ‘క్రూయిజ్: నేవిగేట్ ది ఫ్యూచర్’ అనే థీమ్ తో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 500 మందికి పైగా డెవలపర్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉందని రాంరెడ్డి తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఉత్ప్రేరకంగాఉన్న భారత రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం అభివృద్ధిపరంగా కొత్త విప్లవానికి సిద్ధమవుతోందని న్యూ ఇండియా సదస్సు కన్వీనర్ ధర్మేందర్ వరద పేర్కొన్నారు. ఈ కొత్త విప్లవానికి దేశంలోని మెట్రోయేతర నగరాలే నాయకత్వం వహిస్తాయని తాము విశ్వసిస్తున్నట్టు చెప్పారు.