హైదరాబాద్ రియల్ రంగం దారుణంగా దెబ్బతింటుందని.. అమ్మకాలు స్తంభించాయనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. మార్కెట్లో ధరల దిద్దుబాటు జరిగితే.. నిర్మాణ రంగానికి ప్రయోజనమే తప్ప నష్టమేం ఉండదని క్రెడాయ్ తెలంగాణ సెక్రటరీ జనరల్ కె.ఇంధ్రసేనారెడ్డి అభిప్రాయపడ్డారు. నగర రియల్ రంగంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. భాగ్యనగరంలో అత్యాశతో గాలిమేడలు కట్టే డెవలపర్లు తాజా పరిస్థితుల వల్ల కొట్టుకుపోతారని తెలిపారు. మార్కెట్లో దిద్దుబాటు జరిగితే దాన్ని తట్టుకుని నిలబడే సత్తా.. నగరానికి చెందిన ప్రొఫెషనల్ బిల్డర్లకు ఉందన్నారు. రియల్ రంగం నుంచి ఎంత చెత్త వెళ్లిపోతే అంత మంచిదని విశ్లేషించారు. వాస్తవానికి ప్రస్తుతం ప్రొఫెషనల్ బిల్డర్లకు ఎక్కడా భూములు దొరకట్లేదని తెలిపారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులే ఎక్కువగా పని చేస్తున్నారని.. మనవాళ్లేమో గల్ఫ్ దేశాల బాట పడుతున్నారని ఇటీవల మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడే ప్రత్యేకంగా తెలంగాణ యువత కోసం ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దీనిపై తెలంగాణ నిర్మాణ సంఘాలన్నీ మేధోమథనం జరుపుతున్నాయి. అయితే, ఇక్కడ కొన్ని అంశాల్ని మనమంతా గుర్తించాలి. నితీశ్ కుమార్ బీహార్ సీఎం అయిన తర్వాత పంజాబ్‌లో వరి దిగుబడి అరవై శాతం పడిపోయింది. బీహార్ నుంచి వలసలు తగ్గిపోవడమే అందుకు ప్రధాన కారణమని ఆతర్వాత అర్థమైంది. అక్కడి స్థానికుల్లో అధిక శాతం మంది వ్యవసాయంపై దృష్టి తగ్గిపోయిందని తేలింది. రానున్న రోజుల్లో ఒరిస్సా, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, యూపీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో వలసల్ని తగ్గించే ప్రభుత్వాలు ఏర్పాటయ్యే అవకాశాల్లేకపోలేవు. ఈ క్రమంలో మన రాష్ట్రంలో యువత నైపుణ్యాల్ని పెంపొందించే దిశగా మనమంతా సన్నద్ధం కావాలి.
పాలిటెక్నిక్ కళాశాలలో చదివే విద్యార్థులు రెండేళ్ల పాటు నేర్చుకున్న అంశాల కంటే అధిక విషయాల్ని ప్రాజెక్టు సైటులో ఒక్క నెలలోనే నేర్చుకుంటారు. కాబట్టి, ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది లేకుండానే మన యువతకు వివిధ నైపుణాల్ని నేర్పించాలి. ఉదాహరణకు, ఎల్అండ్ టీ సంస్థ జడ్చర్లలో ఆరు నెలల పాటు శిక్షణనిచ్చిన తర్వాతే యువకుల్ని తమ వద్ద ఉద్యోగంలో చేర్చుకుంటుంది. ఇలా, ప్రతి క్రెడాయ్ ఛాప్టర్‌లోని వివిధ సైట్లలోనే యువకులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల కొరత తీరుతుంది. అధిక శాతం మందికి ఉపాధి దొరుకుతుంది. భవిష్యత్తులో గల్ఫ్ బాట పట్టకుండా నిరోధించే వీలు కలుగుతుంది.
1990లో భారత్, చైనా వంటి దేశాలు.. ఎగుమతుల్లో కానీ జీడీపీలో కానీ దాదాపుగా ఒకే స్థాయిలో ఉండేవి. ఆతర్వాత నుంచి 2018 దాకా.. ప్రపంచంలోని 25 శాతం వస్తువుల ఉత్పత్తిని చైనాయే చేస్తోంది. నేటికీ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే అరవై శాతం ఏసీలు చైనాలోనే తయారవుతాయి. షూస్ 64 శాతం, సోలార్ 70 శాతం, మొబైల్స్ 70 శాతం, అమెరికా జెండాలు 90 శాతం.. ఇలా దాదాపు అధిక శాతం వస్తువులు అక్కడే ఉత్పత్తి అవుతాయి. వందేళ్లలో అమెరికా వాడిన సిమెంటును చైనా మూడేళ్లలో వినియోగించిందంటే నమ్మండి. నేటికీ ప్రపంచంలోని యాభై శాతం యాపిల్ పండ్లు చైనా నుంచి ఎగుమతి అవుతాయి. ఇందులో వారికి గల పోటీ అమెరికా దేశం కాగా.. దాన్ని వాటా కేవలం ఆరు శాతమే. అంటే, రెండు స్థానాల మధ్య ఎంత గ్యాప్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలా చైనా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం.. 1990 తర్వాత అక్కడి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద దృష్టి పెట్టడమే. ప్రతి నగరానికో ఔటర్ రింగ్ రోడ్డు, రింగ్ రోడ్డులు వంటివి అభివృద్ధి చేశారక్కడ. అదే సమయంలో వ్యవసాయం మీద కూడా దృష్టి పెట్టారు. హైడల్ పవర్ మీద ఫోకస్ పెట్టి.. ఆ విభాగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. చైనాలో ఏ వస్తువు ఉత్పత్తి అయినా, అక్కడ్నుంచి బయటి ప్రాంతాలకు అత్యంత వేగంగా రవాణా జరిగేలా అక్కడి ప్రభుత్వం మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసింది, ఇదే బాటలో తెలంగాణ ప్రభుత్వం పయనిస్తూ.. మౌలిక అభివృద్ధి మీద దృష్టి సారించింది. మన వద్ద వ్యవసాయం పెరిగింది. ఉత్పత్తి రంగాలకు పెద్దపీట లభిస్తోంది. నిన్నటివరకూ ఎకరా రెండు నుంచి 5 లక్షలున్న భూములు నేడు పాతిక నుంచి యాభై లక్షలకు చేరుకున్నాయి. కాబట్టి, రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి ఢోకా ఉండదని చెప్పొచ్చు.
శ్రీలంక తరహాలో ప్రపంచంలోని మరో అరవై దేశాలు ఆర్థిక నష్టాల్లో చిక్కుకునే ప్రమాదముందని ప్రపంచ ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ.. గత త్రైమాసికంలో 7.2 ట్రిలియన్ డాలర్లు పడిపోయిందని సమాచారం. రెండో త్రైమాసికంలోనూ ఇలాంటి ఫలితమే ఏర్పడితే.. ఆర్థిక మాంద్యం ఎదురయ్యే ప్రమాదముంది. 2008 తరహాలో రిసెషన్ ఏర్పడిన మన భారతదేశానికి వచ్చే నష్టమేం లేదు. ఇదే సమయంలో మనం పలు అంశాలపై దృష్టి సారించాలి. మన సంస్థల్ని బలోపేతం చేసుకోవాలి. నిర్మాణ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. కొనుగోలుదారులకు అవసరమయ్యే ఇళ్లను మాత్రమే నిర్మించాలి. అప్పుడే ప్రతి నిర్మాణ సంస్థ ఎగుతున్నది.
This website uses cookies.