రాజకుమారి.. అలియాస్ శ్వేత యెల్లాప్రగడ రావు. హిప్ హాప్ ప్రపంచంలో దూసుకుపోతున్న తెలుగు సంతతికి చెందిన ర్యాపర్. కాలిఫోర్నియాలోని క్లేర్ మెంట్ లో తెలుగు తల్లిదండ్రులకు జన్మించిన ఈ డైనమిక్ మహిళ ఇష్టాయిష్టాలు, కలల సౌథం గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. పూర్తిగా సంగీత ప్రపంచంలో మునిగితేలే రాజకుమారితో.. ఆ అంశానికి చాలా దూరంగా ‘రియల్ ఎస్టేట్ గురు’తో ఇతరత్రా అంశాలు ముచ్చటించడం ఆసక్తికరమే కదా?
సొంతిల్లు ఎలా ఉండాలి అని అడగ్గానే ఆమె ఉద్వేగంగా మాట్లాడారు. ‘నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నా మొదటి ఇల్లు కొన్నాను. నా చుట్టూ ఉన్నవారంతా అద్దె ఇళ్లల్లో నివసిస్తుండగా.. నాకు సొంత ఇల్లు ఉండటం అనేది అద్భుతమైన అనుభూతి కదా? నేను ఎప్పుడూ నా ఇంటిని నాకు అనుకూలంగా ఉండేలాగే తీర్చిదిద్దుకుంటాను. నా మొదటి ఇంట్లో అత్యంత ఇష్టమైన భాగం నా స్టూడియో.. ఇంకా విశాలమైన స్థలం కలిగి ఉండటం. అనంతరం నా ఇళ్లంటిలోనూ ఇదే ట్రెండ్ కొనసాగించాను’ అని తెలిపారు.
కొత్త ఇంటికి సంబంధించి నిర్వహణ, నాణ్యత, శక్తి సామర్థ్యాలు కొన్ని కారణాలైతే.. ఆమె మరికొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. ‘నేను కచ్చితంగా మినిమలిస్టిక్ కాదు. నేను కచ్చితంగా అన్నీ ఎక్కువగా ఉండాలని కోరుకునే అమ్మాయిని. పరిశుభ్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తాను. అదే సమయంలో యుగాలను కలపడానికి ఇష్టపడతాను.
ఖాళీ అద్దాలు, కాఫీ టేబుల్స్ చాలా బాగుంటాయి కదా? ఆధునిక ఫినిషింగ్ తో కూడిన కళాత్మక పనితనం అందులో కనిపించొచ్చు’ అని రాజకుమారి వ్యాఖ్యానించారు. తన అవసరాలకు అనుగుణంగా ఇంటిని మార్చడానికి డబ్బులు ఎంత జాగ్రత్తగా ఖర్చు చేస్తారో ఆమెతో మాట్లాడినప్పుడు తెలిసింది. ‘ప్రస్తుతం నాకు లాస్ ఏంజెలెస్ లో ఇల్లు ఉంది. కానీ నేను ముంబై, గోవాలో కూడా ఇళ్లు ఉండాలని అనుకుంటున్నాను. సందడిగా ఉండే ఈ నగరాల్లో నా కలల గృహాలు ఉండాలి. ప్రస్తుతం ఆర్కిటెక్చరల్ ట్రెండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. నేను వాస్తును నమ్ముతాను. అందువల్ల నా కలల గృహాలు దానికి అనుగుణంగానే ఉండాలని కోరుకుంటాను. వాస్తు అనేది ఇంటికి మరింత విలువను జోడిస్తుంది. ఇక మాడ్యులర్ కిచెన్ తో అధునాతన ఉపకరణాలను జోడిస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేం’ అని పేర్కొన్నారు.
1970ల నాటి షాగ్ కార్పెట్ లేదా పాత వంటగది ఉపకరాణాలు ఆమెకు ఇష్టం లేదని తెలుస్తోంది. లాస్ ఏంజెలెస్ లో పెరుగుతున్న దక్షిణ భారతదేశ అమ్మాయిగా ఆమె ఒకప్పుడు చాలా కఠినమైన, ఒంటరి సమయాన్ని కూడా గడిపారు. కానీ ఈరోజు ఆమెకు అక్కడ సొంత ఇల్లు ఉంది. తన కలల ఇంటి గురించి రాజకుమారి చెప్పడం కొనసాగిస్తూ.. ‘గోవాలోనే ఇల్లు ఎందుకు ఉండాలని కోరుకుంటున్నానో చెబుతాను. అది ఆధ్యాత్మిక ప్రదేశం కూడా. నేను అక్కడకు వెళ్లిన ప్రతిసారీ పునరుజ్జీవం పొందుతాను. లొకేషన్, స్టైల్, వైబ్స్, లైటింగ్ అనేవి కలల సౌథంలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశాలు.
తూర్పు, పడమరలను కలపడాన్ని ఇష్టపడతాను. దానికి అనుగుణంగా ఉండే డిజైన్లనే మీరు చూస్తారు. నా కెరీర్, ఫ్యాషన్ సెన్స్ ని బట్టి ఇక్కడ నా ఉద్దేశం ఏమిటో మీకు అర్థమైందనుకుంటాను’ అని రాజకుమారి వ్యాఖ్యానించారు. ఇక సెలబ్రిటీల్లో బాలీవుడ్ నడుడు అనిల్ కపూర్ ఇల్లంటే ఆమెకు చాలా ఇష్టమని చెప్పారు. ‘నేను ఒకసారి దీపావళి పార్టీ కోసం ఆయన ఇంటికి వెళ్లాను. ఇల్లు మొత్తం చాలా అందంగా ఉంది. వారు టన్నుల కొద్దీ పెయింటింగులు, మనసుకు హత్తుకునే పూల అమరికలు నన్ను కట్టిపడేశాయి. నా ఇంటిని కూడా అలా అందంగా పూలతో నింపే పూల వ్యాపారి కోసం చూస్తున్నాను’ అని నవ్వుతూ ముగించారు.
This website uses cookies.