Categories: TOP STORIES

నిర్మాణ సందేహాల నివృత్తికి క్రెడాయ్ స్టడీ టూర్

    • తెలంగాణలోని 15 చాప్టర్ల నుంచి
      200 మందికి పైగా హాజరు

రియల్ రంగంలో కొనుగోలుదారులకు, అమ్మకందారులకు మధ్య ఓ వేదికగా పని చేసే క్రెడాయ్ తెలంగాణ మరో అడుగు ముందుకేసింది. నిర్మాణ రంగంలో నైపుణ్యాలకు కొరత లేకుండా చూస్తున్న ఈ సంస్థ.. తాజాగా నిర్మాణ రంగంలో వస్తున్న కొత్త కొత్త సాంకేతికతలను తన సభ్యులందరికీ పరిచయం చేసేందుకు, ఈ రంగంలో పలువురు బిల్డర్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రప్రథమంగా స్టడీ టూర్ ఇటీవల నిర్వహించింది. తెలంగాణలోని 15 చాప్టర్లకు చెందిన దాదాపు 200 మందికి పైగా సభ్యులు దీనికి హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ లోని కీలక ప్రాజెక్టులను వారంతా పరిశీలించారు. తద్వారా కొత్త కొత్త సాంకేతికతల గురించి తెలుసుకోవడంతోపాటు తమకు ఉన్న సందేహాలను సంబంధిత ఇంజనీర్లు, డెవపర్లను అడిగి నివృత్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు మురళీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. క్రెడాయ్ సభ్యులకు నిర్మాణ రంగంలోని కొత్త కొత్త అంశాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ స్టడీ టూర్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. పౌలోమీ, ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా, సలార్ పూరియా కమర్షియల్ ప్రాజెక్టులతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ హబ్ ను కూడా పరిశీలించినట్టు తెలిపారు. వివిధ రకాల ప్రాజెక్టులన్నంటిలో బేస్ మెంట్ లెవల్ నుంచి బ్రిక్ వర్క్ వరకు క్లబ్ హౌస్ నుంచి ఇతరత్రా మౌలిక వసతుల వరకు అన్నింటిపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ టూర్ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణాల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకునేందుకు ఇలాంటి టూర్లు ఉపకరిస్తాయన్నారు. మురళీ కృష్ణారెడ్డి చొరవతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని.. తాము వంద మంది లోపు వస్తారని భావించగా.. 200 మందికి పైగా సభ్యులు ఈ టూర్ కు హాజరై అన్ని అంశాలనూ ఆసక్తిగా తెలుసుకోవడం సంతోషం కలిగించిందని క్రెడాయ్ తెలంగాణ ఎలక్ట్ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి టూర్లు మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు.

This website uses cookies.