ఆఫీస్ స్పేస్ వినియోగంలో మనమే అగ్రస్థానంలో ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, ఢిల్లీని దాటేసి హైదరాబాద్ దేశంలోనే నెంబర్ వన్ నగరంగా నిలిచిందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఖాజాగూడ పెద్ద చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్లలో ఎక్కడున్న హైదరాబాద ఎక్కడికి వచ్చిందో ఆలోచించాలన్నారు. ఎన్ని కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు జరిగితే ఈ రోజు ఓఆర్‌ఆర్ మీదుగా హైదరాబాద్‌కు వస్తుంటే విదేశాలకు వెళ్లిన అనుభూతి కలుగుతుందని వ్యాఖ్యానించారు.
శాంతిభద్రతలు, జీవన వ్యయం, జీవన నాణ్యత వంటివి బాగుండటం వల్లే హైదరాబాద్ కు పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలో వ్యాక్సిన్ కేపిటల్ గా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 35 వాతం హైదరాబాద్‌లో ఉత్పత్తి చేస్తున్నారని, వచ్చే సంవత్సరంలో 50 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోనే తయారవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 900 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్ తయారు చేస్తుండగా వచ్చే ఏడాది 1400 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్ తయారవుతాయని వివరించారు. రూ.10 వేల కోట్లతో మూసీ మీదుగా 55 కిలోమీటర్ల ఎక్స్ ప్రెస్ వే నిర్మించి ఆ ప్రాంత రూపురేఖలు మారుస్తామని కేటీఆర్ ప్రకటించారు. రూ.6250 కోట్లతో మెట్రోను రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మిస్తామని.. దీనిని మూడేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రూ.2400 కోట్లతో లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఇక ప్రపంచ స్థాయి ఫిలింసిటీ కోసం రాచకొండలో స్థలాన్ని గుర్తించామని తెలిపారు.