దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణరంగ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు రియల్టర్స్ బాడీ క్రెడాయ్-ఎన్సీఆర్ చర్యలు చేపట్టింది. కరోనా మహమ్మారి నుంచి వారిని కాపాడేందుకు దాదాపు 5వేల మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించింది. మార్చి 15లోగా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏర్పాట్లు చేసింది. హెచ్ టీ పరేఖ్ ఫౌండేషన్, హెచ్ డీఎఫ్ సీ క్యాపిటల్ తో కలిసి నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. గురుగ్రామ్ సెక్టార్ 89లోని ఏటీఎస్ మారిగోల్డ్ ప్రాజెక్టు వద్ద ఈ డ్రైవ్ ప్రారంభించినట్టు క్రెడాయ్-ఎన్సీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ లలోని వివిధ నిర్మాణ సైట్ల వద్ద 5వేల మందికిపైగా లబ్ధిదారులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను మొదటి లేదా రెండో డోసు టీకా వేయనున్నట్టు తెలిపింది. బాధ్యతాయుతమైన సంస్థగా భారతదేశాన్ని కోవిడ్ రహితంగా మార్చేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని క్రెడాయ్-ఎన్సీఆర్ అధ్యక్షుడు పంకజ్ బజాజ్ తెలిపారు.