- పెండింగ్ సమస్యల్ని పరిష్కరిస్తాం
- రియల్ వ్యాపారం సజావుగా సాగాలి
- మాస్టర్ ప్లాన్‌లో అంశాలు మార్చాలి
- విద్యుత్తు, మంచినీరు, బోర్‌వెల్ కు
సులువుగా అనుమతుల్ని ఇవ్వాలి!
తెలంగాణ నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. గురువారం రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశం సచివాలయంలో జరిగింది. క్రెడాయ్, నరెడ్కో, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి బిల్డర్ల సోదరభావంతో ప్రభుత్వంతో కలిసి పని చేయాలని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగం తన వ్యాపారాన్ని సజావుగా నిర్వహించేలా చూడటమే ప్రభుత్వ ప్రయత్నమని తెలిపారు. పరిశ్రమకు అనుమతులు త్వరితగతిన పొందేందుకు ప్రభుత్వం టీఎస్ బీపాస్ వంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి విధానపరమైన సమస్యలన్ని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.
సమావేశంలో నిర్మాణ సంఘాల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎస్‌కు వివరించారు. వాటిని త్వరగా పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్‌లోని కొన్ని అంశాలు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని, కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించే వరకు మున్సిపల్ శాఖలో కమిటీ వేసి.. ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌లోని ఆ అంశాలను మార్చాలని కోరారు. ఇతర పరిశ్రమల మాదిరిగానే నిర్మాణ స్థలంలో తాత్కాలిక వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వాలని ప్రతినిధులు సూచించారు. భవన నిర్మాణ అనుమతితో పాటు టీఎస్‌బీపాస్ కింద బోర్‌వెల్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. భవన నిర్మాణానికి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ టీఎస్ బీపాస్ అప్లికేషన్లో భాగంగా ఇవ్వాలని కోరారు.
దరఖాస్తుదారులు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించడానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కార్యాలయాల్లో టెక్నికల్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్మాణ సంఘాల ప్రతినిధులు కోరారు. సాధారణ సిస్టమ్ వైఫల్యాన్ని నివారించడానికి ప్రస్తుత, భవిష్యత్తు సిస్టమ్ లకు అనుగుణంగా టీఎస్ బీపాస్‌లో ఇప్పటికే ఉన్న ఐటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. తనఖా నమోదు, నీటిపారుదల శాఖ ద్వారా హెచ్‌ఎండీఏ పరిధిలోని వివిధ చెరువుల రీసర్వే తదితర అంశాల్ని సమావేశంలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ రెరా చైర్మన్ డా.ఎన్.సత్యనారాయణ, సీసీఎల్‌ఏ కమీషనర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్, కమర్షియల్ టాక్స్ కమీషనర్ నీతూ ప్రసాద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, చీఫ్ సిటీ ప్లానర్ దేవెందర్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.