Categories: TOP STORIES

సాగుకు ఉరేస్తున్న వెంచర్లు

గ‌త ప‌దేళ్ల‌లో.. 5 లక్షల ఎకరాల్లో లేఔట్లు

ఫామ్ ప్లాట్లంటూ ఇష్టారాజ్యంగా వెంచ‌ర్లు

ఎప్ప‌టిలాగే ప‌ట్టించుకోని టీఎస్ రెరా!

ఇదే కొనసాగితే ఆహార కొరత తప్పదంటున్న నిపుణులు

తెలంగాణలో ఆహార కొరత తప్పదా? తినడానికి తిండి లేని పరిస్థితి వస్తుందా? అన్నీ దిగుమతి చేసుకునే దుస్థితి దాపరిస్తుందా? అంటే ఔననే అంటున్నారు నిపుణులు. ఎందుకో తెలుసా? ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు వేయడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు.

ఒకప్పుడు కేవలం లేఔట్స్ వేసి ఫ్లాట్స్ వేసి అమ్మేవారు. ఇప్పుడేమో ఏకంగా ఫార్మ్ ప్లాట్లంటూ అమ్ముతున్నారు. పైగా లేఔట్ వేయకుండానే వ్యవసాయ భూములను గుంటల్లో అమ్మేస్తున్నారు. తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఫామ్ ప్లాట్లు అంటూ విక్ర‌యిస్తున్నారు. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. రైతుబంధు కూడా ఇస్తున్నారు. దీంతో జనం ఎగబడి ఆ ప్లాట్ల‌ను కొంటున్నారు. ఇలా గ‌త ప‌దేళ్ల‌కాలంలో.. తెలంగాణ‌లో సుమారు 4 నుంచి 5 ల‌క్ష‌ల ఎక‌రాల సాగు భూమి.. రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్లుగా మారిపోయింది.

మ‌న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి .. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కొత్తగా ప్రతిపాదించిన రీజినల్ రింగు రోడ్డు కార‌ణంగా ఇంకెన్ని ల‌క్ష‌ల ఎక‌రాలు వెంచ‌ర్లుగా మారుతాయేమోన‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణ ఆహార కొరతను ఎదుర్కొనే సమయం ఎంతో దూరంలో లేదని ప్ర‌ముఖ బిజినెస్ కోచ్‌ వేణు భగవాన్ హెచ్చరిస్తున్నారు.

ఇంతకు ముందు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు వంటివి న‌గ‌రానికొచ్చేవి. గ‌త ప‌దేళ్ల‌లో రియల్‌ ఎస్టేట్‌లో కృత్రిమ ధరల పెంపుతో మెజారిటీ రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారించట్లేదు. దాన్ని బ‌దులు అధిక శాతం మంది రియల్ ఎస్టేట్ వెంచర్ల వైపు దృష్టి పెడుతున్నారు. కొనేవాళ్లు ఉంటున్నారు కాబట్టే ఇలాంటి వెంచర్లు పుట్టుకొస్తున్నాయని.. అలాంటి వాటిని కొనడం మానేయ‌డమే పరిష్కారమని వేణు భ‌గ‌వాన్ అంటున్నారు.

అభివృద్ధి అనేది విధ్వంసానికి దారి తీయకూడదని ఆయ‌న స్పష్టం చేశారు. నిజమైన విలువను జోడించడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాలన్నారు. రియల్ వెంచర్లలో స్విమింగ్ పూల్, జిమ్ తదితర సౌకర్యాలతో ఆకర్షిస్తున్నారని.. అలా కాకుండా జనాలకు మట్టితో అనుబంధం పెంచే విధంగా ఫుడ్ ఫారెస్ట్ వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు.

This website uses cookies.