రియల్ ఎస్టేట్ గురుతో జాంబీరెడ్డి నటి దక్షా నగర్కర్
ఇల్లు ఎలా ఉండాలనే విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి ఉంటుంది. ఆకర్షణీయమైన రంగులు, కళ్లు చెదిరే షాండ్లీయర్లు, అబ్బురపరిచే ఇంటీరియర్ డెకరేషన్.. వీటిని చాలామందే ఇష్టపడతారు. కానీ జాంబీరెడ్డి నటి దక్షా నగర్కర్ మాత్రం కాదు. తన కలల గృహం గురించి ఆమె విభిన్నమైన అభిరుచులున్నాయి. శ్వేతసౌథాన్ని మించింది మరొకటి ఉండదని.. తెలుపురంగుతోనే ప్రశాంతత చేకూరుతుందని చెబుతోంది. ఇక్కడ శ్వేతసౌథమంటే అమెరికా అధ్యక్ష భవనం.. ఇల్లు మొత్తం అలా తెల్లరంగులో ఉండాలనేది దక్ష కోరిక. ఖరీదైన క్రీమ్ షేడ్స్ కంటే, క్లాసిక్ మార్బుల్ కంటే చక్కని తెలుపు రంగే తనకు ప్రశాంతత ఇస్తుందని వెల్లడించింది. తన ఇల్లు ప్రత్యేకంగా ఉండాలని చెబుతూనే వైట్ థీమ్ మాత్రం కొనసాగిస్తానని చెప్పింది. ఎక్కువగా కన్నడ చిత్రాల్లో నటించిన ఈ పొడవు సుందరి.. ఇంటికి సంబంధించి తన అభిప్రాయాలు, అభిరుచులను రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా పంచుకుంది.
‘నా మొదటి ఆస్తి ఏది అని అడిగారు కదా? ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ఇప్పటివరకు నేను ఇంకా సొంతిల్లు కొనుక్కోలేదు. అయితే, షూటింగు సందర్భంగా నేను గడిపిన మొదటి ఇంటి నుంచి నాకు ఎన్నో సంతోషకరమైన అనుభూతులు ఉన్నాయి. నేను ఢిల్లీలో జన్మించాను. అక్కడే నా మొదటి ఇల్లు. పెద్ద పచ్చిక బయలు ఉండేది. నేను ఎలా నడవాలో నేర్చుకున్న చోటు అది. నడవడమే కాదు.. సైక్లింగ్, దాగుడుమూతలు ఆడటం, డ్రైవింగ్ నేర్చుకోవడం అన్నీ అక్కడే. ప్రస్తుతం నేను ఉంటున్న ఇంట్లో లాన్ చూస్తే నాకు చిన్నప్పటి సంగతులన్నీ గుర్తుకువస్తాయి. ఎంతో భావోద్వేగంతో కూడుకున్న ఆ సంగతులు భలే అనుభూతి కలిగిస్తాయి. మనం ఉన్న మొదటి ఇల్లు కచ్చితంగా బోలెడు జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది’ అని దక్ష పేర్కొంది.
తెలుపు.. తెగ నచ్చేస్తుంది..
తెలుపు రంగంటే తనకు చాలా ఇష్టమని.. తన దుస్తులతోపాటు బెడ్ కవర్లు, మార్బుల్ ఫ్లోరింగ్ కూడా శ్వేత వర్ణంలోనే ఉంటాయని ఈ జాంబీరెడ్డి భామ చెబుతోంది. తనకు సంబంధించినంత వరకు చాలా వస్తువులు తెలుపు రంగులోనే ఉంటాయని చెప్పింది. తెలుపు ఇంటీరియర్లలోనే తాను పెరిగానని పేర్కొంది. ఇక ఇంట్లో విలాసవంతమైన వస్తువులు కావాలా లేక కనీస తరహాలో అవి ఉండాలా అన్న ప్రశ్నకు.. విలాసవంతమైన వస్తువులతో గదులు నింపిన రోజులన్నీ ఎలా వెళ్లిపోయాయో అని నిట్టూర్పు విడిచింది. కనీస తరహాలో ఇంటీరియర్ ఉండాలనేది కొత్త ధోరణి అని వెల్లడించింది. తన కలల గృహాన్ని ఇలా కనీస ఇంటీరియర్ తో సాధ్యమైనంత ఎక్కువ వైట్ షేడ్ ఉండేలా డిజైన్ చేసుకోవాన్నదే తన కోరిక అని తెలిపింది.
స్వతంత్ర విల్లాలంటేనే తనకు మక్కువ ఎక్కువని దక్ష వెల్లడించింది. ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా.. విల్లాల్లో ఉండాలనే కోరికలో ఎలాంటి మార్పూ రాదని పేర్కొంది. అందరిలాగే ఈ నటికి కూడా ఇంటి విషయంలో కొన్ని కోరికలున్నాయి. ‘ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా నా దగ్గర ఉంటే, నా కోసం ఓ కోటను కట్టుకునేదానిని. అది కూడా శ్వేతసౌథం. పెద్దగా ఉన్న పచ్చికబయలు.. ఆకర్షణీయమైన వరాండా.. భోగిమంటలు వేసుకునేందుకు చక్కని స్థలం.. పెంపుడు జంతువులు తిరగడానికి అనువుగా విశాలమైన ప్రాంతం.. ఇవీ నా అభిరుచులు. అలాగే భద్రత అనేది అత్యున్నత అంశం. ఇందుకోసం కొండపై కోట కట్టుకోవాలనేది నా కల’ అని మనసులోమాట బయటపెట్టింది.
సినిమాల్లో చూపించినట్టుగా కర్టెన్లతో కూడిన పోస్టర్ బెడ్ పై నుంచి నిద్ర లేవడం.. సూర్యోదయాన్ని చూడటం.. వర్షం పడుతున్నప్పుడు ఇంటి చుట్టూ ఉన్న మేఘాలను చూస్తూ ఆస్వాదించడం తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. ఇక ఇంటికి సంబంధించినంత వరకు పెరటిని అమితంగా ఇష్టపడతానని వెల్లడించింది. ఎక్కువ సమయం అక్కడే గడుపుతానని పేర్కొంది. పెరట్లో ఉన్న పచ్చికపై నడుస్తూ ఉంటే వచ్చే ఆ అనుభూతి వేరని.. అది తన మూలాలను గుర్తుకుతెస్తుందని వివరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లోకి సరైన స్థాయిలో ఆక్సిజన్ వచ్చే వ్యవస్థ ఉండటం అత్యంత ముఖ్యమైన అంశమని దక్ష ఉద్ఘాటించింది. ‘ఎవరికైనా సరే సరైన మనుగడ అనేది ఉండాలి. కొండపై కలల ఇల్లు కట్టుకోవాలనేదే నా కోరిక అని చెప్పా కదా? ఇందులో మరో అంశమేమిటంటే.. స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా సువిశాలమైన స్థలం కూడా ఉండాలి. నేను స్వేచ్ఛని కోరుకునే అమ్మాయిని కాబట్టి.. మన కోసం నిర్మించుకునే ప్రదేశాలు మరింత స్వేచ్ఛాయుతంగా ఉండాలని అనుకోవడం సబబే కదా’ అని ప్రశ్నించింది.
ప్రపంచం ఎప్పటికప్పుడు ఎన్నో మార్పులతో ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో మూస ధోరణిలోనే ఉండిపోవడం తనకు నచ్చని స్పష్టంచేసింది. తన ఇల్లు ఎలా ఉండాలనే విషయంలో ఎన్నో కోరికలున్న దక్షా నగర్కర్.. అందుకు అనువైన డిజైన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఆయుష్మాన్ ఖురానా బంగ్లా ఈమెకు నచ్చింది. ముఖ్యంగా ఖురానా వాల్ ఆఫ్ ఫేమ్ బాగా ఆకట్టుకుందని.. తాను కూడా తన సినీ ప్రయాణంలో వచ్చిన అవార్డులన్నింటినీ అందులో పెట్టుకుని మురిసిపోవాలనే ఆకాంక్షను వ్యక్తంచేసింది. ఇక దేశవ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరం హైదరాబాద్ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని ముగించింది.