హైదరాబాద్‌లో 56 కిలోమీటర్ల మూసీ నదితో పాటు చెరువుల పునరుద్ధరణకు సంబంధించి వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తూ.. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దానకిశోర్ తెలిపారు. శుక్రవారం ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. కొద్ది నెలల క్రితం పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ, దుబాయ్ వాటర్‌ఫ్రంట్ అధికారులను కలిసి.. వాణిజ్య అనుసంధానాలు, పెట్టుబడి నమూనాల్ని అధ్యయనం చేశామన్నారు. ఈ క్రమంలో మూసీ నది కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు 56 కిలోమీటర్ల వరకూ.. పరిశుభ్రమైన పరిసరాల్ని అభివృద్ధి చేయడానికి.. ఎమ్మార్డీసీ సంస్థ ద్వారా.. మూసీ నదిలో సాధ్యమయ్యే జలసంబంధ సమస్యలను అధ్యయనం చేయాలని తొలుత ప్రతిపాదించామని చెప్పారు. ఇందుకు సంబంధించిన నమూనాల్ని సిద్ధం చేయడానికి పలు సంస్థల్ని ఆహ్వానించగా.. ఎనిమిది కంపెనీల్లో ఏడు సంస్థలకు అర్హత లభించిందన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఈ ఏడు కన్సల్టెంట్ సంస్థలు ఏం చేస్తాయంటే.. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికి.. పశ్చిమాన ఉన్న ఉస్మాన్‌సాగర్ నుంచి తూర్పున గౌరెల్లి వరకు మూసీ నది యొక్క హైడ్రోలాజికల్ నమూనాను అధ్యయనం చేస్తాయి. ప్రతి కిలోమీటరుకు ఓవర్‌ఫ్లో పరిస్థితులు, పొడి వాతావరణం, నాలాల ద్వారా మురుగునీరు నదిలోకి ప్రవహించడంతో పాటు గరిష్ఠ నిల్వ పరిమాణాన్ని అంచనా వేస్తాయి. వివిధ ప్రాంతాల్లో చెక్ డ్యామ్‌లను నిర్మించి నదిలోని నీటి నిల్వను పరిశీలిస్తాయి. హైడ్రాలిక్స్ కోసం అనుకరణ నమూనాను సిద్ధం చేయడంతో పాటు మూసీ నది పొడవునా ప్రహారీ గోడల నిర్మాణానికి డీపీఆర్‌నూ సిద్ధం చేస్తాయి. ఇలా ప్రణాళికాబద్ధంగా అడుగులు ముందుకేయడం ద్వారా మూసీ నదికి పునరుజ్జీవం కలుగజేస్తాం.
మూసీ నదిని అభివృద్ధి చేయాలంటే అంత ఆషామాషీ విషయమేం కాదు. ఇందుకు క్షేత్రస్థాయిలో నుంచి పని చేస్తేనే సాధ్యమవుతుంది. ఇందులో భాగంగా తొలుత.. మూసీ నది బఫర్ జోన్‌లో ఆస్తులు, ఆక్రమణల్ని గుర్తించడానికి క్షేత్రస్థాయి సర్వేను నిర్వహిస్తాం. నదికి యాభై మీటర్లలోపు అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి అనుమతుల్ని మంజూరు చేయం. మూసీ నది శుభ్రం, తీరం స్థిరీకరణ, సైకిల్ ట్రాకుల అభివృద్ధి, జాగింగ్ ట్రాక్‌లు, నగర స్థాయిలో ప్రాథమిక సౌకర్యాలు, నాలెడ్జ్ పార్క్ ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అందులోనే వినోద సౌకర్యాలు, నీటి కొలనులు వంటివి అభివృద్ధి చేస్తాం. మూసీ నదిలో రబ్బరు డ్యామ్‌లను ఏర్పాటు చేసి, రోడ్ కనెక్టివిటీలను పొందుపరుస్తాం. వాటిలోనే వంతెనల నిర్మాణం, పాదచారుల జోన్‌లు, పీపుల్స్ ప్లాజాలు, హెరిటేజ్ జోన్‌లు, గ్రీన్ స్పేస్‌లు, హాకర్ జోన్‌లు, వంతెనలు, వినోద మరియు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తాం. అక్కడే క్రీడా సౌకర్యాలు, వాణిజ్య మరియు రిటైల్ స్థలాల్ని పొందుపరుస్తాం. మొత్తానికి మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించి.. ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం.
డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, ఏసీఎల్‌బీల సహాయంతో.. హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణకు వ్యూహాత్మక ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నాం. అన్ని చెరువుల్ని గుర్తించి, వాటి సరిహద్దులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లు, ఇన్‌లెట్ మరియు అవుట్‌లెట్లను నిర్వహించడానికి ప్రణాళికల్ని రచిస్తున్నాం. చెరువులకు సంబంధించిన ఎఫ్‌టీఎల్ సరిహద్దులను భౌగోళిక-ప్రాదేశిక చిత్రాల ద్వారా గుర్తిస్తాం. నీటిపారుదల, రెవెన్యూ శాఖలతో సమన్వయంతో ప్రభుత్వ, ప్రైవేటు భూముల యాజమాన్యాన్ని గుర్తించడమే కాకుండా చెరువుల సరిహద్దుల్లో దురాక్రమణాల్ని గుర్తించే ప్రక్రియను చేపడతాం. చెరువుల పునరుద్ధరణకు అవసరమయ్యే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించి స్థానిక పట్టణ సంస్థలకు అందజేస్తాం.
This website uses cookies.