తమ ఆదేశాల అమలులో జాప్యం చేసినందుకు గానూ ఓ బిల్డర్ కు రూ.40 వేల జరిమానా విధిస్తూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుకు రూ.3.32 లక్షలను తిరిగి ఇచ్చినప్పటికీ, అది ఇవ్వడంలో చేసిన జాప్యానికి గానూ ఈ మేరకు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే..
2015లో రేఖ అనే 65 ఏళ్ల మహిళ రేవతి అసోసియేట్స్ నుంచి హింగనాలో ఓ ప్లాట్ కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ.1.21 లక్షలు చెల్లించారు. అయితే, ప్లాట్ అప్పగించడంలో రేవతి అసోసియేట్స్ విఫలమైంది. దీంతో రేఖ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించగా.. 18 శాతం వడ్డీతో 1.21 లక్షలు వెంటనే తిరిగి ఇవ్వాలని బిల్డర్ ను ఆదేశించింది. అలాగే మానసిక, శారీరక వేదనకు పరిహారంగా రూ.25 వేలు, కోర్టు ఖర్చుల కింద రూ.5 వేలు 30 రోజుల్లో చెల్లించాలని సూచించింది. ఒకవేళ గడువులోగా ఆ మొత్తం చెల్లించకుంటే, రోజుకు రూ.25 అదనంగా ఇవ్వాలని స్పష్టం చేసింది.
అయినప్పటికీ బిల్డర్ ఎలాంటి చెల్లింపులూ చేయలేదు. దీంతో రేఖ మరోసారి కమిషన్ ను ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషన్.. రేవతి అసోసియేట్స్ డైరెక్టర్ సుహాస్ మోర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తమ ఆదేశాలు అమలు చేయకుంటే జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. అంతేకాకుండా జరిమానాగా రూ.40వేలు చెల్లించాలని ఆదేశించింది. అయితే, తాను రూ.3.32 లక్షలు వెనక్కి ఇచ్చేస్తానని, జరిమానా విధించొద్దని సుహాస్ ప్రాధేయపడ్డారు. కానీ కమిషన్ ఆయన వినతిని తోసిపుచ్చింది. 34 నెలలపాటు ఫిర్యాదుదారుని బాధపెట్టినందుకు ఎలాంటి మినహాయింపూ ఇవ్వలేమని పేర్కొంటూ జరిమానా చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
This website uses cookies.