ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ మనదేశంలో జోరుగా దూసుకెళ్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 శాతం వృద్ధితో రూ.14 వేల కోట్లకు చేరుకుంటుందని అప్ ఫ్లెక్స్ ఇండియా సంస్థ అంచనా వేసింది. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వార్షిక అద్దె ఆదాయం 2022-23లో రూ.8,903 కోట్లుగా ఉండగా.. 2023-24లో రూ.14,227 కోట్లకు పెరుగుతుందని తెలిపింది. ఈ విభాగంలో సేవలు అందించే ఆపరేటర్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరం చివరికి 10.4 లక్షలుగా ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 12.66 లక్షలకు పెరగనున్నట్టు పేర్కొంది. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ 47 లక్షల చదరపు అడుగుల పరిమాణం నుంచి 57 లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తుందని తెలిపింది.
ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లో ఒక్కో డెస్క్ నెలవారీ సగటు అద్దె రూ.9,200 నుంచి రూ.10,400కు.. అలాగే, అక్యుపెన్సీ రేటు 75 శాతం నుంచి 90 శాతానికి మెరుగుపడినట్టు వెల్లడించింది. హైబ్రిడ్ పని విధానాల అమలు నేపథ్యంలో సౌకర్యవంతమైన పని ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతోందని వివరించింది. కరోనా ముందు 55 పట్టణాల పరిధిలో 1500కు పైగా ప్రదేశాల్లో 400కు పైగా ఆపరేటర్లు పని చేసేవారు. ఇప్పుడు 90 పట్టణాల పరిధిలోని 2,320 ప్రాంతాల్లో 965కు పైగా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. పెద్ద కార్పొరేట్లు, సంస్థల నుంచి హైబ్రిడ్ పని విధానాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఇకపై ఈ మార్కెట్ ఇంకా విస్తరిస్తుందని నివేదిక అంచనా వేసింది. 2023 జూన్ నాటికి దేశ వాణిజ్య ఆఫీస్ లీజింగ్‌లో కోవర్కింగ్ వాటా 19 శాతంగా ఉన్నట్టు అప్‌ఫ్లెక్స్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి ఇది 25-27 శాతానికి పెరుగుతుందని తెలిపింది.
This website uses cookies.