Categories: LATEST UPDATES

జోరుగా ఇళ్ల అమ్మకాలు

  • ఈ ఏడాది 2.9 లక్షల యూనిట్లు చేరుకుంటుందని అంచనా
  • 2024లో 3 లక్షల మార్కు దాటే అవకాశం
  • జేఎల్ఎల్ నివేదిక అంచనా

దేశంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ విభాగం జోరుగా దూసుకెళ్తోంది. గృహ రుణ వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు పెరిగినప్పటికీ అమ్మకాలు ఎక్కడా తగ్గలేదు. ఇళ్ల కొనుగోలు సెంటిమెంట్ సానుకూలంగానే ఉందనడానికి నిదర్శనంగా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది భారీగా ఇళ్లు అమ్ముడయ్యాయి. మొత్తమ్మీద 2023లో 2.6 లక్షల యూనిట్లు విక్రయమవుతాయని అంచనా. నిజానికి మన దేశంలో 2008 నుంచే రెసిడెన్షియల్ రియల్ రంగం వృద్ధి కొనసాగుతోంది. మధ్యలో కరోనా సమయంలో కాస్త నెమ్మదించినా తర్వాత క్రమంగా పుంజుకుని దూసుకెళ్తోంది. 2024లోనూ ఇదే ఒరవడి కొనసాగుతుందని, అమ్మకాలు 3 లక్షల మార్కును చేరుకుంటుందని జేఎల్ఎల్ నివేదిక పేర్కొంది. 2023 మొదటి తొమ్మిది నెలల్లో రెసిడెన్షియల్ అమ్మకాలు 1.96 లక్షల యూనిట్లకు చేరుకుందని, 2022లో జరిగిన మొత్తం అమ్మకాల్లో ఇది 91 శాతమని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2024లో ఇళ్ల అమ్మకాలు 2.9 లక్షల యూనిట్ల నుంచి 3 లక్షల యూనిట్ల వరకు ఉండొచ్చని అంచనా వేసింది. లాంచింగుల్లో కూడా 2023 గణనీయమైన పురోగతి చూసిందని, మొత్తం 2.23 లక్షల యూనిట్లు లాంచ్ అయ్యాయని ఇది 21.5 శాతం వృద్ధి అని పేర్కొంది. 2023 చివరి నాటికి ఇది 2.8 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని అభిప్రాయపడింది. అలాగే ప్రముఖ డెవలపర్ల నుంచి బలమైన సరఫరా కారణంగా 2024లో లాంచ్ లు మరింత ఎక్కువగా ఉంటాయని.. కొత్త సంవత్సరంలో 2.8 లక్షల నుంచి 2.9 లక్షల యూనిట్లు లాంచ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

వడ్డీ రేట్లు పెరుగుతున్నా.. ఇళ్ల ధరలు ఎక్కువవుతున్నా.. కొనుగోలుదారులు ఇళ్లు కొనడం పట్ల ఉల్లాసమైన వైఖరి కొనసాగించడంతో దేశీయ హౌసింగ్ మార్కెట్ మొత్తం సెంటిమెంట్ సానుకూలంగానే ఉందని జేఎల్ఎల్ ఇండియా రీసెర్చ్ హెడ్ సమంతక్ దాస్ పేర్కొన్నారు. జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం తీరుతెన్నులను బట్టి ఆర్బీఐ పాలసీ రేటు తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే 2023 ప్రైమరీ మార్కెట్లో రెసిడెన్షియల్ అమ్మకాలు దాదాపు 3 లక్షల యూనిట్ల మార్కును చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇక ప్రీమియం సెగ్మెంట్ లోనూ అమ్మకాల వృద్ధి కొనసాగింది. 2023 మొదటి తొమ్మిది నెలల్లో రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల మిడ్ సెగ్మెంట్ కేటగిరీ ఆధిపత్యం చెలాయించగా.. ప్రీమియం సెగ్మెంట్ (రూ.1.50 కోట్ల కంటే ఎక్కువ) వాటా పెరిగింది. ఈ విభాగంలో ఇళ్ల అమ్మకాలు 2022లో 18 శాతం ఉండగా.. ఇప్పుడు 22 శాతానికి పెరిగాయి. లగ్జరీ సెగ్మెంట్ లో (రూ.3 కోట్ల కంటే ఎక్కువ) ఢిల్లీ, ముంబైలు రికార్డు సృష్టించాయి. 2023 మొదటి తొమ్మిది నెలల్లో 83 శాతం వృద్దితో 14,627 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 మొదటి తొమ్మిది నెలల్లో ఈ సంఖ్య 8013గా నమోదైంది. ఇళ్ల కొనుగోలుదారులు పెద్ద సైజు ఇళ్లను కోరుకుంటుండటంతో డెవలపర్లు కూడా వీటినే నిర్మిస్తున్నారు.

This website uses cookies.