Categories: LATEST UPDATES

విలాస ఇళ్లకు.. విస్తృత డిమాండ్

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ సొంతింటి అవసరం తెలిసొచ్చింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు మొదలుపెట్టింది. తాజాగా పెద్ద, విశాలమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. వర్క్ ఫ్రం హోం విధానం పెరగడంతో చాలామంది విలాసవంతమైన గృహాల వైపు మొగ్గు చూపుతున్నారు.

డబ్బంటే లెక్క లేని ఎలైట్ క్లాస్, అధిక చెల్లింపులు పొందే ప్రొఫెషనల్స్ లగ్జరీ బాట పడుతున్నారు. పెద్ద, మెరుగైన, విలాసవంతమైన, వివిధ రకాల సౌకర్యాలతో తాము కోరుకున్న స్వర్గాన్ని కళ్ల ముందు సృష్టించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాపార కుటుంబాలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, టాప్ కంపెనీల సీఈఓలు తమ ఇంటి కోసం రూ.50 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు వెచ్చించారన్నా పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. ఇండియా సోత్ బీ ఇంటర్నేషనల్ రియల్టీ, సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్త నివేదిక ప్రకారం..

ముంబై, పుణెల్ లగ్జరీ హౌసింగ్ అమ్మకాలు 2021లో బాగా జరిగాయి. గత నాలుగేళ్లలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. 2022లో ఇది కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉందని అంచనా. 2020 నుంచి లగ్జరీ నివాసాలకు డిమాండ్ పెరిగిందని.. వీటిలో పెట్టుబడి పెట్టడానికే చాలా మంది మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విలాసంతమైన గృహాలు, విల్లాలు, బంగ్లాల విక్రయాలు పెరగడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. పచ్చని ఓపెన్ ఏరియాతోపాటు స్టడీ రూమ్, ఫిట్ నెస్ ప్రాంతం, ఇతర విశ్రాంతి కార్యకలాపాలకు తగిన స్థలాన్ని అందించే ఇళ్లనే ఇష్టపడుతున్నట్టు చెబుతున్నారు.
భారతీయ రియల్ రంగంలో ఎన్నారై పెట్టుబడుల పునరుద్ధరణ కారణంగా విలాసవంతమైన ఇళ్ల డిమాండ్ బాగా పెరిగింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది ఇళ్ల అమ్మకాలను పరిశీలిస్తే.. ప్రీమియం విభాగం (రూ.90 లక్షల నుంచి రూ. 2 కోట్ల మధ్య) ఇళ్ల అమ్మకాల వాటా 25 శాతం ఉండటం విశేషం. ఇదే ట్రెండ్ కొనసాగితే 2022లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాల్లో అంతకుమించి పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంది.

This website uses cookies.