Categories: TOP STORIES

ఆఫీసు స్పేసుకు డిమాండ్‌!

దేశంలోని ప్రధాన నగరాలలో కంటే హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరిగిపోతుంది. ఈ ఏడాది నగరంలో 80 లక్షల చ.అ. కార్యాలయాల స్థల లావాదేవీలు జరుగుతాయని సావిల్స్‌ ఇండియా అంచనా వేసింది. ఇప్పటికే 10 లక్షల చ.అ. విస్తీర్ణంలో భవనాలు పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపింది. గతేడాది నగరంలో 57 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరగ్గా.. ఇందులో లక్ష చ.అ. కంటే ఎక్కువ స్పేస్‌ లావాదేవీలే 70 శాతం ఉన్నాయి. అలాగే 2021లో 86 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ నిర్మాణాలు పూర్తయ్యాయి.

కార్యాలయాలు పునఃప్రారంభం కావటం, వ్యాపార సెంటిమెంట్‌ బలపడటం, లీజు కార్యకలాపాలు పెరగడం వంటి కారణంగా ఈ ఏడాది నగరంలో కొత్తగా కోటి నుంచి 1.2 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ సప్లయి అవుతుందని సావిల్స్‌ ఇండియా హైదరాబాద్‌ ఎండీ శేష సాయి అంచనా వేశారు. ఈ ఏడాది ముగింపు నాటికి భాగ్యనగరంలో గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ 8.5 కోట్ల చ.అ.లకు చేరుకుంటుందని చెప్పారు. ప్రధానంగా మణికొండ, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లలో ఎక్కువ సప్లయి జరుగుతుందని తెలిపారు.
ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్య లభ్యత, అందుబాటు ధరలు వంటివి నగరంలో ఆఫీస్‌ స్పేస్‌ వృద్ధికి చోదకాలుగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు.
2021 మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), బ్యాకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), కో–వర్కింగ్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ కంపెనీల రాకతో హైదరాబాద్‌లో ప్రీమియం కార్యాలయాల భవనాల మద్యవర్తిత్వం పెరిగిందని, అయితే ఇదే సమయంలో ఇతర నగరాల్లోని ప్రీమియం భవనాలతో పోలిస్తే నగరంలో అద్దెలు స్థిరంగా ఉండే అవకాశాలున్నాయని వివరించారు.

This website uses cookies.