హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో నయా ట్రెండ్ మొదలైంది. నివాస స్థలాల ధరలు చుక్కలను తాకడంతో అపార్ట్‌మెంట్స్‌కు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. అందులోనూ ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌కు ఏడాదికాలంగా గిరాకీ అమాంతం పెరిగినట్లు అనరాక్ ప్రాపర్టీ సంస్థ తాజా అధ్యయనంలో తేలింది. ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాల్లోని కంపెనీల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించడంతో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడంతో పాటు అత్యధిక సమయం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌ను బుక్ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేయడం విశేషం.
గ్రేటర్ పరిధిలో ప్రధాన నగరంతోపాటు గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, హైటెక్ సిటీ, మాదాపూర్, కిస్మత్‌పూర్, శంషాబాద్, నిజాంపేట్, మియాపూర్, బాచుపల్లి, కొంపల్లి, రాయదుర్గం, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లలో ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌ను బుక్‌చేసుకునే వారి శాతం ఏడాదిగా గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. అంతకు ముందు (2020) సంవత్సరంతో పోలిస్తే 2021 ఆగస్టు నాటికి మూడు పడకగదుల ఫ్లాట్స్‌ను బుక్‌చేసుకున్న వారి శాతం 44 నుంచి 56 శాతానికి పెరగడం విశేషం. అనూహ్యంగా డబుల్ బెడ్‌రూమ్ కొనుగోలుదారుల శాతం 47 నుంచి 31 శాతానికి తగ్గిందట. ఇక సింగిల్ బెడ్‌రూమ్‌లను కొనుగోలు చేసే వారి శాతం 15 నుంచి 11 శాతానికి తగ్గినట్లు ఈ అధ్యయనం తెలిపింది.
కోవిడ్, లాక్‌డౌన్‌డౌన్, ఆర్థిక వ్యవస్థ మందగమనం, అన్ని రంగాల్లో నెలకొన్న స్తబ్దత వంటి పరిణామాలు ప్రస్తుతం నిర్మాణ రంగాన్ని ఒడిదొడుకులకు గురిచేస్తున్నాయి. కోవిడ్‌కు ముందు అపార్ట్‌మెంట్ నిర్మాణానికి సంబంధించి నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు బిల్డర్లు రూ.1400 నుంచి రూ.1600 వరకు అయ్యేది. ప్రస్తుతం మేస్త్రీలు,నిర్మాణ రంగ కూలీలకు దినసరి వేతనాలు అనూహ్యంగా పెరగడం, ఎలక్ట్రికల్, సిమెంటు, స్టీలు, ఇసుక, ఇటుకలు, శానిటరీ విడిభాగాల ధరలు చుక్కలను తాకడంతో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1800 నుంచి రూ.2000 వరకు పెరిగింది. ఈ నేపథ్యంలోనూ నగర శివార్లలో అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు ఏమాత్రం తగ్గలేదని ఈ అధ్యయనం పేర్కొంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు నూతన ప్రాజెక్టులు సైతం ప్రారంభమయ్యాయని తెలిపింది.
This website uses cookies.