Categories: LATEST UPDATES

పెరిగిన ఆఫీస్‌ స్పేస్ స‌ర‌ఫ‌రా

  • తొలి ఆరు నెలలో 7 నగరాలలో 75 శాతం వృద్ధి
  • జనవరి–జూన్‌లో 2.51 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ సప్లయి
  • హైదరాబాద్‌లో 38.4 లక్షల చ.అ. సరఫరా
  • నికర లీజుల్లో మాత్రం 19 శాతం క్షీణత
  • జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక వెల్లడి

కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో కార్యాలయ స్థలాల సరఫరా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి–జూన్‌ మధ్య కాలంలో 75 శాతం వృద్ధి రేటుతో 2.51 కోట్ల చదరపు అడుగుల (చ.అ.) ఆఫీస్‌ స్పేస్‌ సప్లయి జరిగిందని జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, పుణే, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై నగరాల్లో గతేడాది ఇదే కాలంలో కొత్త ఆఫీస్‌ స్పేస్‌ సప్లయి 1.43 కోట్ల చ.అ.లుగా ఉంది.

లాక్‌డౌన్‌ అనంతరం వ్యాపారాలు పునఃప్రారంభమైన తర్వాత ఆఫీసు లీజు కార్యకలాపాలలో బలమైన వృద్ధి నమోదవుతుందని డెవలపర్లు నమ్ముతున్నారని జేఎల్‌ఎల్‌ ఇండియా (ఆఫీస్‌ లీజింగ్‌ అడ్వైజరీ) రాహుల్‌ అరోరా తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది సెకండ్‌ హాఫ్‌లో ఎక్కువమందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగితే ఆఫీసు నుంచి పనులకు వీలవుతుందని.. దీంతో స్థిరమైన వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గతేడాది జనవరి–జూన్‌లో 37.3 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ సప్లయి జరగగా.. ఈ ఏడాది 3 శాతం వృద్ధితో 38.4 లక్షల చ.అ.లకు పెరిగింది.

బెంగళూరులో 33.5 లక్షల చ.అ. నుంచి 95.3 లక్షల చ.అ.లకు, ఢిల్లీలో 38.8 లక్షల చ.అ. నుంచి 52.3 లక్షల చ.అ.కు, ముంబైలో 22.9 లక్షల చ.అ. నుంచి 47.3 లక్షల చ.అ.కు, పుణేలో 6 లక్షల చ.అ. నుంచి 12.8 లక్షల చ.అ.కు పెరిగాయి. చెన్నైలో 5.3 లక్షల చ.అ. నుంచి 5 లక్షల చ.అ.లకు క్షీణించగా.. కోల్‌కతాలో మాత్రం కొత్తగా ఎలాంటి ఆఫీస్‌ స్పేస్‌ సప్లయి జరగలేదు. అయితే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నికర లీజు లావాదేవీలు క్షీణించాయి. గతేడాది జనవరి–జూన్‌ కాలంలో 1.19 కోట్ల చ.అ. లీజులు జరగగా.. ఈ ఏడాదికి 19 శాతం క్షీణించి 96.3 లక్షల చ.అ.లకు తగ్గాయి.

This website uses cookies.