Categories: TOP STORIES

కూల్చివేస్తారా? రిజిస్టర్ చేస్తారా?

ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు గల నిజాంపేట్ కార్పొరేషన్లో దాదాపు వెయ్యికి పైగా అక్రమ నిర్మాణాలుంటే.. మరి, కొత్తగా ఏర్పడిన ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్ని ఉండాలి? ఈ అక్రమ కట్టడాల వ్యాపారం తెలంగాణ మున్సిపల్ చట్టం రానంత వరకూ మూడూ పూవులు ఆరు కాయలుగా విరాజిల్లింది. కానీ, 2020 ఆగస్టు 26 తర్వాత వాటిని కట్టిన బిల్డర్లు, అందులో ఫ్లాట్లు కొన్న కొనుగోలుదారులు హాహాకారాలు పెడుతున్నారు.

అపార్టుమెంట్లను కూల్చివేస్తారేమోనని కొందరు ఆందోళన చెందుతుంటే.. తమ ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తే మేలని కొనుగోలుదారులు వేడుకుంటున్నారు. మరి, ఈ విషయంలో కాలయాపన చేయకుండా.. ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

అవన్నీ దాదాపుగా పాత పంచాయతీలే.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా పేరు మారాయంతే. అయినా, అక్రమ నిర్మాణాలకు అలవాటు పడ్డవారు తమ పాత నైజాన్ని వదులుకోవట్లేదు. 267 గజాలు లేదా 300 గజాల స్థలాన్ని తీసుకోవడం.. పంచాయతీ నుంచి జి ప్లస్ 2 అంతస్తుల అనుమతితో.. పోటీలు పడి ఐదంతస్తుల్ని కట్టేశారు. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, భీమవరం, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలకు చెందిన చిన్న స్థాయి బిల్డర్లే ఈ తరహా అక్రమ కట్టడాల్ని ఎక్కువ నిర్మించారు.

ఒక్క నిజాంపేట్ లోనే 113 అక్రమ నిర్మాణాల్ని గత ఏడాదిలో కార్పొరేషన్ సీజ్ చేసిందంటే.. మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నెన్ని అక్రమ నిర్మాణాలుండాలి? అనుమతుల్లేని అపార్టుమెంట్లలో కొనకూడదని కార్పొరేషన్లు ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. భాగ్యనగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంతో వీరికేం సంబంధం ఉంటుంది? పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అనేకసార్లు అక్రమ నిర్మాణాల్ని నిర్మించొద్దని విన్నవించారు. అయినా, వీరు పెద్దగా పట్టించుకోలేదు.

దాదాపు ఐదు వేలు?

నిజాంపేట్, కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, బాచుపల్లి, మల్లంపేట్, బౌరంపేట్, మణికొండ, ఉప్పల్, బండ్లగూడ, నార్సింగి.. ఇలా పాత పంచాయతీల పరిధి గల ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఇవన్నీ కలిసి ఎంతలేదన్నా ఐదు వేలకంటే ఎక్కువే ఉంటాయని అధికారిక అంచనా. దురదఈష్టం ఏమిటంటే, ఇవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టినవి కావు. బాజాప్తా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2019 నుంచి ఆరంభమైనవి కావడం గమనార్హం.

అందరూ దొంగలే..

హైదరాబాద్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆశయాలకు భిన్నంగా కొందరు అక్రమార్కులు.. సరైన అనుమతుల్లేకుండా విచ్చలవిడిగా చిన్న చిన్న అపార్టుమెంట్లను నిర్మించారు. పక్కపక్కన రెండు ప్లాట్లు దొరికితే చాలు.. ఐదారు అంతస్తులు వేసిన బిల్డర్లూ ఉన్నారు. అక్రమ అంతస్తులు వేయడానికి అంగీకరించిన స్థలయజమాని, వాటిని నిర్మించిన బిల్డర్, నిర్మించేటప్పుడు కళ్లు మూసుకున్న అధికార యంత్రాంగం, అది అక్రమ కట్టడమని తెలిసినా వాటిని కొనుగోలు చేసిన కొనుగోలుదారులు.. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా అక్రమార్కులంతా కలిసి హైదరాబాద్ నగర అందాన్ని అస్తవ్యస్తం చేశారు.

తెలిసీ ఎలా కొన్నారు?

కొందరు బిల్డర్లు ఎప్పుడూ అక్రమ నిర్మాణాలే కడుతుంటారు. అది వారి నైజం. వారిని ఎవరూ మార్చలేరు. కాకపోతే, అన్నీ తెలిసిన కొనుగోలుదారులకు ఏమైంది? అసలు వీళ్లు ఎలా కొనుగోలు చేశారు? మార్కెట్ రేటు కంటే తక్కువ ఉండటం… హైదరాబాద్లో ఏదో ఒక ఇల్లు ఉండాలి కాబట్టి, అప్పో సొప్పో చేసి కొన్నామని చెబుతున్నారు. ఇలాంటి వారిలో మార్పు రానంతవరకూ అక్రమ వ్యవహారం ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడేమో కొన్నవారంతా ఆ అపార్టుమెంట్ లోకి అడుగుపెట్టలేక.. బయట నెలనెలా అద్దెలు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నారు.

వింత వాదన..

బిల్డర్లు అక్రమంగా అపార్టుమెంట్లు కడుతుంటే అధికారులు కఠిన చర్యలు తీసుకుని నియంత్రించి ఉంటే.. తాము కొనేవాళ్లం కాదని వాదిస్తున్నారు. అప్పుడేమో బిల్డర్ ని వదిలేసి.. ఇప్పుడేమో తమలాంటి కొన్నవాళ్లని ఇబ్బంది పెట్టడం ఎంతవరకూ కరెక్టు అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో పంచాయతీ అనుమతి అంటే సక్రమమే అని అనుకున్నారట. పైగా రుణాలు వస్తాయని భావించారట. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బ్యాంకు రుణాల్ని మంజూరు చేయకపోవడంతో వీరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది.

కూల్చివేస్తారా?

కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ అయినా.. అక్రమ నిర్మాణాల్ని ఎలా కూల్చివేస్తారో తెలుసు కదా? ఒక అపార్టుమెంట్లో ఫ్లోరులో ఏదో కొంత భాగం కూల్చివేస్తారు. అంతే, ఆ వార్త పత్రికల్లో, టీవీల్లో మార్మోగిపోతుంది. కానీ, రెండు రోజుల తర్వాతేం జరుగుతుంది? ఎంచక్కా ఆ కూల్చివేసిన రంధ్రాన్ని సదరు బిల్డర్ ఎంచక్కా పూడ్చివేస్తారు. ఎవరికి కావాల్సిన అమ్యామ్యాలు వారికి అందుతాయి. ఆతర్వాత అందులో కొనుగోలుదారులూ ఎంచక్కా పాలు కూడా పొంగించేస్తారు. కాబట్టి, అక్రమ నిర్మాణాల కూల్చివేత అనేది నిత్యం జరిగే తంతు కాబట్టి, కొందరు బిల్డర్లు ఈ వ్యవహారాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. ఒకవేళ ప్రభుత్వం గనక అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తానంటే.. తమ అపార్టుమెంట్ ని కూడా కూల్చివేయమనండి అని కొనుగోలుదారులూ అంటున్నారు. కానీ, ఇన్ని అపార్టుమెంట్లను ఒకేసారి కూల్చివేసే సాహసం ప్రభుత్వం చేస్తుందా అనేదే ప్రశ్న.

అక్రమార్కుల రంగప్రవేశం..

2020 ఆగస్టు నుంచి అక్రమ లేఅవుట్లు, అనధికార లేఅవుట్లలో.. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అపార్టుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయడాన్ని ప్రభుత్వం నిలిపివేయడంతో కొందరు అక్రమార్కుల పంట పండింది. తాము రిజిస్ట్రేషన్ చేయిస్తామని నమ్మబలుకుతూ.. ప్రతి ఫ్లాటు నుంచి సుమారు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వానికి చేరువగా ఉండే ప్రజాప్రతినిధులు తమ ఏరియాల్లో నిర్మాణ సంస్థల నుంచి ఇలా ప్రత్యేకంగా ‘ట్యాక్స్’ కూడా వసూలు చేస్తున్నారు. అంటే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో జీఎస్టీ కట్టినట్లే.. వీరికి కట్టాల్సిందే అన్నమాట. లేకపోతే, అంతే సంగతులు.

* అక్రమ నిర్మాణాలు కడుతున్నప్పుడు కళ్లు మూసుకున్న అధికార యంత్రాంగంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే, హైదరాబాద్లో ఇదే తంతు భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. ఇప్పటివరకూ కట్టేసినవి పడగొట్టడం సాధ్యం కాదు కాబట్టి, ఇక నుంచి అయినా అక్రమ నిర్మాణాల్ని నిరోధించేందుకు పటిష్టమైన చర్యల్ని తీసుకోవాలి. ఈ అక్రమ ఫ్లాట్ల విషయంలో ప్రభుత్వం వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలి.

రేచల్ ఛటర్జీ మున్సిపల్ కమిషనర్ గా..
1993లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్కి కమిషనర్ గా రేచల్ ఛటర్జీ వ్యవహరించే రోజులవి. అప్పట్లో కార్ల వాడకం తక్కువే. ఒక అపార్టుమెంట్లో పది ఫ్లాట్లుంటే మూడు కార్లు మాత్రమే ఉండేవి. అందుకే చాలామంది బిల్డర్లు అక్రమంగా స్టిల్ట్, సెల్లార్లు కట్టేవారు. అందులో ముప్పయ్ శాతం వాహనాలకు, మిగతా స్థలంలో షాపులు, ఫ్లాట్లను నిర్మించేవారు. ఆమె వాటి మీద ఉక్కుపాదం మోపడంతో తను కమిషనర్ గా ఉన్నంత కాలం స్టిల్ట్, సెల్లార్లో ఒక్క అక్రమ నిర్మాణాన్ని కట్టడానికీ ఎవరూ సాహసించలేదు. కాబట్టి, అధికారులు కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటి అక్రమ నిర్మాణాల్ని కట్టేవారిని ఒక ఆట ఆడుకోవచ్చు. కాకపోతే, ప్రజాప్రతినిధులే అక్రమార్కులు, అధికారుల మధ్య ఒప్పందాలు కుదుర్చుతుంటే.. ఇలాంటి నిర్మాణాల్ని నియంత్రించడం సాధ్యమేనా? అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇప్పుడు జీహెచ్ఎంసీ లేదా ఇతర కమిషనర్లు ఎంతమేరకు కఠినంగా వ్యవహరించగలరు?

This website uses cookies.